Wednesday, May 28, 2025
Homeతెలంగాణ రౌండప్మురుగు కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు

మురుగు కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు

- Advertisement -
  • – క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
    – వర్షపు జలాలు నిలువ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
    నవతెలంగాణ – కంఠేశ్వర్ 
  • జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరి, పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయని అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. బైపాస్ రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజీని, నిజామ్ కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్ లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంకు సమీపంలో గల మురుగు కాల్వను, రాజరాజేంద్ర చౌరస్తా నుండి పీ.ఎఫ్ కార్యాలయం వరకు గల డ్రైనేజీని, సాయినగర్ రోడ్-నెంబర్ 1 లో గల మురుగు కాల్వను, తీన్ కమాన్ నుండి ఐ.డీ.ఓ.సి వరకు గల డ్రైనేజి, వినాయకనగర్ లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా నిర్మించదల్చిన మురుగు కాల్వల ప్రతిపాదిత స్థలాలను సందర్శించి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలుచోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకుని నిర్మాణాలు కలిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మురుగుకాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్తా, చెదారం తొలగింపజేయాలని, ఎక్కడ కూడా వర్షపు నీరు నిలువ ఉండకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురియకముందే డీ-సిల్టింగ్ పనులను పూర్తి చేయించాలని సూచించారు. అవకాశం ఉన్నచోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించాలని, వీలుకాని చోట పారిశుధ్య కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీల పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఇదివరకు వర్షాలు కురిసిన సమయాలలో వరద తాకిడికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. డ్రైన్లలోకి చేరే వర్షపు జలాలు పూడిక కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్లే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పూడికతీత పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈ.ఈ ఆనంద్ సాగర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -