మాదక ద్రవ్యాల

డ్రగ్స్‌ చట్టంలో మనిషి నుంచి మనిషికి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవ్వడాన్ని కూడా ట్రాఫికింగ్‌ అనే అంటారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్‌. ఒక విధంగా డ్రగ్స్‌ వాడుతున్న వాళ్ళను క్షమించి వారికి కొత్త జీవితాన్ని అందించడానికి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు. కానీ సరఫరా చేస్తున్న డ్రగ్‌ మాఫియాను మాత్రం కూకటి వేళ్ళతో పెకలించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిని దష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ జూన్‌ 26, 1987న చేసిన తీర్మానం మేరకు ‘డ్రగ్స్‌’ వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. దీనికై ప్రతీ సంవత్సరం జూన్‌ 26 న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవంగా ప్రకటించింది. ప్రతీ సంవత్సరం ఒక ధీమ్‌ తో ప్రపంచ దేశాలన్నీ ఈ డ్రగ్‌ రక్కసిపై పోరాటం సాగించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసేందుకుగాను నడుం బిగించింది. ఈ సంవత్సరం (2023) హానికరమైన మాదక ద్రవ్యాలను వినియోగించే వారు, వారి కుటుంబాలలో అత్యధికులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పరిస్ధితులకు దారితీస్తుంది. వారికి అవసరమైన సహాయాన్ని పొందకుండా నిరోధించే పరిస్ధితులు బలపడేలా చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలు ముందుగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై వివక్షతను తొలగించి మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని ప్రపంచాన్ని సాధించడంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ధీమ్‌ ప్రకటించింది. ఆ విషయాలే ఈ వారం కవర్‌ స్టోరీ.
డ్రగ్స్‌ బానిసత్వం
సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియో గించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తరచూ పొందాలని కోరికతో క్రమేపీ అది బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తుమందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. వాటిని సమకూర్చు కోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ విధంగా సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు, మాదక ద్రవ్యాలను వినియోగించే ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్నట్లు ఈ మధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేల్చి చెప్పింది.

డ్రగ్‌ అడిక్ట్స్‌ను గుర్తించడమెలా?
డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరికే ఉద్రేకపడిపోతుంటారు. దేనిపైనా దష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ చూపించరు. మంచి దుస్తులు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. ఒళ్లు వణుకుతుండటం, మాటలు ముద్ద ముద్దగా వస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది.
వారి ధరించిన దుస్తులు నుండి చిత్రమైన వాసన రావచ్చు. కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయారవుతాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా నిద్రలేకుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణాలు, ఫోన్‌ లో రహస్యంగా మాట్లాడటం ఎవ్వరితోను కలవక పోవడం, ఎక్కువుగా బబుల్‌ గమ్‌, చూయింగ్‌ గమ్‌ లు నమలడం, డోర్‌ లాక్‌ చేసుకుని గదిలోనే ఉండిపోవడం…. ఇటువంటి లక్షణాలున్నవారు డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్నట్లే.
సమిష్టి పోరుతో సత్ఫలితాలు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు కార్యక్రమాలు చేపట్టినా వీటి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్దేశనం చేసినా, డ్రగ్స్‌ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. ఉగ్రవాదంవల్ల మరణి స్తున్నవారి కంటే ప్రపంచంలో మత్తుమందుల వల్ల కన్ను మూస్తున్నవారే ఎక్కువ ఉన్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైంది.
అంటే పూర్తిగా అది ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ సర్వేలోను వీటి వినియోగం పెరిగినట్లు గణాంకాలు వస్తున్నాయి తప్ప అదుపులోకి వస్తున్న జాడ ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలి. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ విషయమై ప్రభుత్వం చేపట్టే కార్యాచరణ లో చిత్తశుద్ధి ఉండాలి. అదే సమయంలో విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు చేయాలి అంటే విద్యా బోధనలో నైతిక విద్యకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. విలువలు లేని విద్యా విధానం ఎన్ని చట్టాలు చేసినా ఇటువంటి విష సంస్కతలకు ఎప్పటికి చరమ గీతం పాడలేం. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ సకల అనర్ధాలకు, అరాచకాలకు అమానుష ధోరణులుకు కారణమై కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం అనేది జాతి భవితకే తీరని చేటని గుర్తించి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా దీనిపై పోరు సాగిస్తే తప్పక మాదక మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం అవుతుంది.ఆనాడే వివేకవంతమైన సమాజం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పుడు అప్పుడని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ మాదకద్రవ్యాల భూతం ఎల్లెడలా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మనిషి ఆరోగ్యం పైనే కాదు సమాజంపైనా తీవ్ర దుష్పరిమాణాలు చూపుతుంది. అందుచేతనే ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టీకరించింది. ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల నుండి 60 సంవత్సరాల వయసు గల పెద్దల వరకూ భాగ్యవంత దేశాల నుండి అభివద్ధి చెందుతున్న దేశాల వరకూ అన్ని వర్గాల వారిని ఈ మాదక మహమ్మారి మత్తుగా మింగేస్తూ ఉంది. జీవితాలను చిత్తు చేసే ఈ డ్రగ్‌ రక్కసి కోరల్లో మత్తు కోసం చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది.
మత్తు
మనకు ఆసక్తి ఉన్న పని చేసినప్పుడు కానీ లేదా మనకు నచ్చిన వ్యక్తులు తారసిల్లినపుడు కానీ నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించినపుడు కానీ అనిర్వచనీయ ఆనందం మన సొంతం అవుతుంది. మన మెదడులో విడుదలయ్యే రసాయనాలే ఈ స్ధితికి కారణం. వీటినే ఎండార్ఫిన్స్‌ అంటారు. మత్తుకు అలవాటు పడని వారికి ఇవి సహజమైన ఆహ్లాద పరిసరాలలో ఆహ్లదకర సంఘటనలలో సహజంగా ఇవి విడుదల అవుతాయి. అదే మత్తు కోసం మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారికి మాత్రం వీటి విడుదల చాలా భిన్నంగా ఉంటుంది. వీరికి ఎండార్ఫిన్‌ విడుదల కావాలి అంటే కచ్చితంగా మత్తు కావాలి. అంటే ఈ స్ధితిలో మెదడు పూర్తిగా మత్తుచేత హైజాక్‌ చేయబడుతుంది. మత్తు కోసం మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు గెలిచినా ఓడినా దానిని మత్తులోనే పంచుకోవాలి అనే భావం వీరిలో క్రమేపీ బలపడిపోతుంది.
నేటి సమకాలీన సమాజంలో పరిశీలిస్తే పుస్తకాల తోటలో విహరిస్తూ పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని ఆర్జించవలసిన ఎందరో విద్యార్థులు పుస్తకాల అధ్యయనానికి బదులు పొగ పీలుస్తున్నారు. గురువులు చెప్పేది మెదడులో ఎక్కించుకోవడానికి బదులు మెదడుకు రసాయనాల మత్తును ఎక్కిస్తూ మత్తులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ రోజురోజుకు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకు పోతున్నారు.
పట్టుమని పదహారేళ్లయినా నిండని ఈ టీనేజ్‌ పిల్లలు కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటివి ముందుగా ప్రారంభిస్తారు. అయితే క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారిపోతాయి. కానీ కాలక్రమంలో ఈ వ్యసనాన్ని సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు. మరింత థ్రిల్‌ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొందరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్‌ వైపు అడుగులేస్తారు. సరదా కోసం ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు.
ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదుకానీ డ్రగ్స్‌ మాత్రం బాగా అందుబాటులోకి వచ్చాయి అనేది మాత్రం వాస్తవం. దేశంలో యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ, అత్యంత విలువైన మానవ వనరులను చీడ పురుగుల్లా తొలిచేస్తూ దేశ భవిష్యత్‌ను పెనుగండంగా మార్చి, మొత్తం సమాజాన్ని విచక్షణా రహితంగా వ్యసనాల ఊబిలోకి డ్రగ్‌ రక్కసి నిర్దాక్షిణ్యంగా నెట్టి వేస్తున్నది.
ఈ సమస్యకు కారణం మాదక ద్రవ్యాల వినియోగం కన్నా ఖండాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గా చెప్పవచ్చు.
చరిత్ర
మత్తు కోసం మత్తు కలిగించే పదార్ధాలను వాడటం ఈ మధ్య కాలంలో మొదలయ్యింది మాత్రం కాదు. చారిత్రిక కాలం నుంచి ఈ తరహా వ్యసనాలు అనేకం కనిపిస్తాయి. అయితే అప్పట్లో వాటికి వినియోగించిన పదార్ధాలు మాత్రం వేరు. మత్తు కోసం ఆనాడు ప్రకతి సిద్ధంగా లభ్యమయ్యే మద్యం, గంజాయి, పొగాకు, నల్లమందు, మత్తునిచ్చే పుట్టగొడుగుల వంటి పదార్థాలను విరివిగా వాడుతుండేవారు. అయితే గత శతాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే సాంప్రదాయ మత్తు పదార్ధాలను తలదన్నే రీతిలో సింథటిక్‌ మత్తు పదార్థాలు ఎపిడ్రిన్‌, కొకైన్‌, ఓపియమ్‌ (నల్లమందు), హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌, కెటామైన్‌… పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాలు ఎక్కువగా వాడుకలోనికి వచ్చేసాయి.
గడచిన ఆరేడు దశాబ్దాల్లో వీటి తయారీ, సరఫరా, విక్రయాల విషయంలో మాఫియా ముఠాలు పని చేయడం, ప్రభుత్వ నియంత్రణలు సత్ఫలితాలు ఇవ్వలేక పోవడం వలన ఈ మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించాయి.
ఈ మత్తు పదార్థాల వినియోగానికి క్రమేపీ యువత బానిసలు కావడం నేడు ఆందోళన కరంగా మారి వారి పాలిట కాలకూట విషాలుగా పరిణమిస్తున్నాయి. ఫలితంగా యువత ఈ మాదక ద్రవ్యాల విషవలయంలో కూరుకుపోతున్నారు. వాస్తవంగా వీటి వినియోగం ద్వారా తాము బానిసలుగా తయారై జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అయితే చాలా మంది ఇది ఎలా ఉంటుంది? ఒక సారి రుచి చూద్దాం అనే కోరికతో మొదలై, దానికి బానిసలుగా మారే స్ధితికి వచ్చిన వారే అధికం. వీరితో పాటు డిప్రెషన్‌ కు గురయిన వారు, ఆందోళనలు ఎక్కువుగా ఉన్నవారు, సామాజికపరంగా వెనుకబడి ఉన్నవారు, ఆర్ధికంగా సమస్యలను ఎదుర్కొనే వారు, చదువులో వెనుకబడిన వాళ్ళు, కుటుంబం నుండి ప్రేమ ఆప్యాయతలు పొందలేని వాళ్ళు, తరచూ గొడవలు పడే భార్యా భర్తలు, జీవితంలో ఊహించని ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని, ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తున్నారు. ఇంతకన్నా ముఖ్యంగా ఈనాటి ఆధునిక కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం కారణంగా పిల్లలపై సరైన పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో తమను గమనించే వారు లేరన్న అవకాశాన్ని సరదా కోసం, ఫ్యాషన్‌, మోజు, స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తుమందులు వినియోగానికి కొందరు అలవాటుపడుతున్నారు. చివరకు ఇది దీర్ఘ కాలిక సమస్యగా పరిణమించిన తరువాత ఆ ఉచ్చు నుండి బయటపడటం సాధ్యం కాక నిలువునా జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

భారత్‌లో మాదక ద్రవ్యాలు
మాదక ద్రవ్యాల విష సంస్కతి మన దేశంలోకి కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వ్యాప్తి మాత్రం చాప క్రింద నీరులా సాగుతూనే ఉంది. డ్రగ్స్‌ బానిసలు రోజు రోజుకు పెరిగిపోతున్న దేశాలలో భారత్‌ ఒకటి..! ఇటీవల కేంద్రం విస్తతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో యువత కొకైన్‌, హెరాయిన్‌, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. ఇండియా క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్‌ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని చెబుతున్న ఎన్‌సీబీ గణాంకాలు భారతావనిని కలవరపెడుతున్నాయి.
మరొక పక్క మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని అంచనా. వీరందరికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే…ఇప్పుడు ఇవి నేరుగా విద్యా సంస్ధల చెంతకే అందుబాటులోనికి వచ్చేసాయి. కెల్విన్‌ అనే డ్రగ్‌ సరఫరాదారుడిని అదుపులో తీసుకున్న సందర్భంలో అతని వద్ద ఉన్న సమాచారం చూస్తే దాదాపు 130 మంది పబ్లిక్‌ స్కూల్‌ చిన్నారులకు డ్రగ్స్‌ అందిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి స్కూల్‌ పిల్లలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయారన్న చేదు నిజం బయట పడింది.
ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ఉపయోగించేవారు 0.71 శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియాలో 2.65 శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడుతున్నారని తెలిసింది.
భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్‌ – డ్రగ్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టాన్ని అమలులోనికి తెచ్చింది. అప్పటి నుండి పరిస్ధితులకు అనుగుణంగా 1988 , 2001, 2004 లో ఈ చట్టానికి సవరణలు చేపట్టారు. అయినా డ్రగ్స్‌ ఇండియాలోకి రావడం మాత్రం తగ్గడం లేదు.
దేశంలో ముంబై తర్వాత పంజాబ్‌ డ్రగ్స్‌ వినియోగంలో అగ్రగామిగా ఉంది. అక్కడ దాదాపు 30 లక్షల మంది డ్రగ్‌ యూజర్లు ఉన్నట్టు అంచనా. గంజాయి సాగు విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.
మన దేశంలో ఒకప్పుడు మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ మాదక ద్రవ్యాలు క్రమేపీ ద్వితీయ శ్రేణి నగరాలకు చివరకు గ్రామాలకు సైతం విస్తరించి ఎల్లెడలా మత్తు వాసనలు గుప్పు మంటున్నాయి. విదేశాల నుంచి తరలి వస్తున్న డ్రగ్స్‌ తో పాటు స్దానికంగా నెలకొన్న ఔషధ పరిశ్రమలలో తయారయ్యే మత్తు పదార్థాలు వీటికి తోడవుతున్నాయి.
గతంలో యువకులు ఏర్పాటు చేసుకునే పార్టీలలో మద్యం ఏర్పాటు చేసుకునే వారు. అయితే ఇప్పటి పార్టీలలో మద్యంకు బదులు మాదక ద్రవ్యాలు చేరాయి. ఉన్నత విద్యా సంస్ధలలో విశ్వ విద్యాలయాల్లో చివరకు పబ్లిక్‌ స్కూల్స్‌ లో సైతం మాదక ద్రవ్యం ఉదంతాలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలను దష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం ‘ఎన్‌డీపీఎస్‌’ తీసుకువచ్చింది. తర్వాత ఎప్పటికప్పుడు పలు సవరణలు చేస్తూ ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితం అయ్యింది. ఫలితంగా ప్రపంచం మొత్తం మీద మత్తులో జోగుతున్న దేశాల్లో భారత దేశం ముందు వరుసలో నిలవడం భావి భారతానికి అత్యంత ఆందోళన కలిగించే విషయం.
డ్రగ్స్‌ కు ఆకర్షితులు కావడానికి కారణాలు..
ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసం లేని వాళ్లు జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం పొందాలనుకునే వాళ్ళు, ఒంటరితనం, ఓటమిని తట్టుకోలేని వాళ్ళు, చదువులు బుర్రకు ఎక్కక పోవడం, చెడు స్నేహాలు.. ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు. పట్టణాలకు పెరుగుతున్న వలసలు. పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అంతరాలు. కనుచూపుమేరలో దొరికే మత్తు పదార్థాలు. పరీక్షలో, ప్రేమలో, ఫెయిల్‌ అయినవారు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం ఎదురు చూసే వాళ్ళు పాశ్చాత్య పోకడలు, టీవీ, సినిమా, మీడియా ప్రభావం ఇత్యాది కారణాల వల్ల యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో ప్రారంభించిన ఈ అలవాట్లు కాల గమనంలో ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారి క్రమేపీ యువత వీటికి బానిసలై బలైపోతున్నారు. ఒక్కసారి ఈ డ్రగ్స్‌ విష వలయంలో చిక్కుకుంటే చాలు, మరలా వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. ఈ లోపు కెరీర్‌ అంతా సర్వనాశనం అవుతుంది. యువత దీనికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. డ్రగ్‌ వ్యసనం నుండి వెనక్కి తిరిగి రాలేని వాళ్ళు మరణం పాలవుతున్నారు. కొందరైతే డ్రగ్స్‌ లభించక బలవన్మరణం పాలవుతున్నారు
మాదక ద్రవ్యాల సరఫరా
మాదక ద్రవ్యాల వినియోగంలో బానిసలుగా చిక్కుకున్న యువతను దాని నుంచి బయటపడేసే విషయంలో ప్రభుత్వాలు సామాజిక సంఘాలు తమ వంతు కషి జరుపుతున్నప్పటికీ డ్రగ్స్‌ మాఫీయా మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదు కానీ పోలీసులు, నిఘా సంస్ధల కళ్ళు కప్పి రహస్య ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ దందా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో స్ధానిక ముఠాలు, అంతర్జాతీయ గ్యాంగులు మార్కెట్‌ లో మాదక ద్రవ్యాలను కుమ్మరిస్తూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, సేవనం విషయంలో కఠిన చర్యలు తీసుకుంలున్నప్పటికీ డ్రగ్స్‌ మాఫియా తమ కార్యకలాపాలను మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు మాదక ద్రవ్యాలపై నిషేధం విధించినా కూడా వీటి ప్రవాహానికి అడ్డు కట్ట వేయలేక పోవడానికి ప్రధాన కారణం ఇంటర్నెట్‌. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సింథటిక్‌ డ్రగ్స్‌ అమ్మకాలు వాయు వేగంతో దేశాంతరాలను, ఖండాంతరాలను దాటి మన దేశం చేరుకుంటున్నాయి. ప్రధానంగా అమెరికా తదితర విదేశాల నుంచి అతిపెద్ద ‘డార్క్‌ నెట్‌వర్క్‌’తో, ఇంటిదొంగల సహకారంతో మత్తు పదార్థాలు సినిమా, ఐ.టి. సహా అనేక రంగాలతో పాటు పబ్లిక్‌ స్కూల్‌ లో చదువుతున్న పిల్లల చేతుల్లోకి కూడా చేరిపోతున్నాయి. గతంలో అంత సులభంగా దొరకని కొకైన్‌, హెరాయిన్‌ వంటివి ఈ-కామర్స్‌, కొరియర్‌ వ్యవస్థ పెరగడంతో మత్తు మందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్ధాలు
శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం ఈ మూడు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి ప్రధాన హేతువులు. అయితే మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఈ మూడు నశించి పోతున్నాయి. వీటి వినియోగం ద్వారా ప్రాధమికంగా విచక్షణ కోల్పోతారు. మాదకద్రవ్యాలు, ఉత్ప్రేరకాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని పొందటం కోసం ఎంతటి అకత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికైనా యువత వెనుకాడరు. డ్రగ్స్‌ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్‌ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దారుణమైన దుష్ప్రభావాలు పెరిగిపోతాయి. చివరకు అకాల మరణాలకు కారణమవుతాయి. డ్రగ్స్‌ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు చూస్తే.. గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్‌, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ప్రదానంగా రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది. లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు మందగింపు
రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. జ్ఞాపకశక్తి క్షీణించడంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఎదురుగా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందరగోళ పరిస్ధితి ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహించి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి పూర్తిగా నశిస్తుంది. మత్తుకు బానిసలుగా మారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. వైద్య నిపుణుల పరిశోధనలు ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో 25 శాతం మంది శారీరక సమస్యలకు గురవుతారు. 42 శాతం ఒత్తిడికి, మానసిక సమస్యలతో బాధపడతారు. 25 శాతం మంది భార్యల నుండి విడాకులు కోరుతున్నారు. 40 శాతం నేరపూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. యువత విషయంలో చూస్తే 45 శాతానికి పైగా సెక్స్‌ లో విఫలమవుతున్నారు. 24 శాతం మంది స్థూలకాయంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువత వారి అలవాట్లను అవసరాలను తీర్చుకునే నేపథ్యంలో సంఘ విద్రోహుల వలలో చిక్కి, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. వీటి ఫలితంగా ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు. ఈ విధంగా డ్రగ్స్‌ మత్తులో పడి యువత నిర్వీర్యమైపోయిన దేశాలు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. మానవ అక్రమరవాణా, దోపిడీలు, హత్యలు, గహ హింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్‌ వినియోగమే మూల కారణమవుతోంది.
ఏది ఏమైనా ఈ మాదక మహమ్మారి వినియోగం, దానికి బానిస కావడమనేది తల్లిదండ్రుల కలలనే కాదు, మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని చెప్పవచ్చు.
నివారణ సాధ్యమే
ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్షును హరించే ఈ మత్తు మహమ్మారి విష వలయంలో చిక్కుకున్న తరువాత దాని నుంచి బయటపడటం కష్టమే కానీ అసాధ్యం కాదనే చెప్పాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలలో మందులు, కౌన్సిలింగ్‌, బిహేవిరియల్‌ థేరపీ వంటి వాటి ద్వారా బయట పడవచ్చు. కాకపోతే, దీనికి కాస్త సమయం, సహనం, కషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. దీనికి కుటుంబం సహకారంతోపాటు వైద్య నిపుణుల అవసరం కూడా తోడవ్వాలి. ప్రధానంగా మాదక ద్రవ్యాల బారి నుంచి బయట పడాలనే గట్టి సంకల్పం డ్రగ్స్‌ వాడే వారిలో ఉండాలి. అయితే ఇలా సంకల్పించిన ప్రతీ సారి ఏదో ఒక విఘ్నం తారసపడుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో నిగ్రహంగా నిలబడి వైద్యుల సలహాలు కుటుంబ సభ్యుల సహకారం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ తీసుకోవడం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే వీరు డ్రగ్స్‌ వాడకానికి దోహద పడిన కారణాలు విశ్లేషణ చేసి దాని నుండి బయట పడటానికి అవసరమైన కౌన్సిలింగ్‌ మానసిక వైద్యులు అందిస్తారు.
మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయట పడాలంటే ముందుగా దానికి దోహద పడిన కారణాలు నిర్ములించాలి. ఇది కేవలం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ ద్వారానే సాధ్యమవుతుంది.
ఇవన్నీ తీసుకుంటూ సడలని మనో సంకల్పంతో నిలబడగలిగితే ఈ విషవలయం నుండి బయటపడటం అసాధ్యం ఏమీ కాదు. ఇవన్నీ పాటిస్తూ డ్రగ్స్‌ కు బానిస అయిన వాళ్ళు కూడా గట్టి సంకల్పంతో ఈ విషవలయం నుండి బయట పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దీనిని కట్టడి చేసే విషయంలో కొన్ని దేశాలు కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. కంబోడియా, వియత్నాం, సింగపూర్‌, థారులాండ్‌ వంటి దేశాలు డ్రగ్స్‌ వినియోగించినా, ఉత్పత్తి నిల్వ వ్యాపారాలకు పాల్పడినా మరణదండన విధిస్తున్నాయి. బానిసలైన వారిని కాపాడేందుకు కాంబోడియా, వియత్నాం, మెక్సికో, సింగపూర్‌, థారులాండ్‌ లాంటి దేశాల ప్రభుత్వాలు బాధితుల పునరావాసం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి.
తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత
చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లల విషయంలో మార్కులు ర్యాంకులు మాత్రమే పరమావిధిగా చూస్తున్నారు తప్ప తమ పిల్లల మానసిక పరివర్తన వ్యవహారశైలి గురించి పట్టించుకోవడంలో శ్రద్ద చూపడం లేదు.వారికి కావలసిన పాకెట్‌ మనీ అందచేస్తూ వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నది అసలు పరిశీలించడం లేదు.
తల్లితండ్రులలో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ది మంతులని ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటూ పిల్లలపై అపార నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పు లేదు. చూపించాలి కూడా. అయితే అదే సమయంలో ఆ నమ్మకం అతి కాకూడదు. నిజంగా ఆ డ్రగ్‌ మహమ్మారి మన ఇంట్లోనే మన పిల్లల చెంత తిష్ట వేసినప్పటికీ దానిని గమనించే అవకాశాన్ని మనకు ఇవ్వదు. ఈ స్ధితిలో పరిస్ధితి చేయి దాటి పోయిన తరువాత బాధ పడి ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రతీ తల్లి తండ్రులు తమ బిడ్డపై నమ్మకంతో పాటు బిడ్డ వ్యవహార శైలి బట్టి అనుమానం కూడా కలగాలి. అప్పుడే పెను ప్రమాదం నుండి బిడ్డను బయట పడేసే అవకాశం మనకు చిక్కుతుంది. ఈ విషయంలో తల్లి తండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
డ్రగ్స్‌ బారిన పడిన వారిని దండించడం, బెదిరించడం, వారితో వాదించడం వారిని చిన్నబుచ్చకునేలా చేయడం ఆత్మన్యూనత కలిగేలా వ్యవహరించడం వంటి చర్యలు ద్వారా వారిని డ్రగ్స్‌ వ్యసనం నుంచి ఎట్టి పరిస్ధితులలో కూడా బయట పడేయలేమని ముందుగా తల్లి తండ్రులు గుర్తించాలి. డ్రగ్స్‌ వాడకం వలన తలెత్తే దుష్పరిణామాల గురించి పిల్లలకు చాలా ఓపికగా వివరించాలి. ఈ వ్యసనం నుండి బయటపడితే సమాజంలో మనం తిరిగి గౌరవ ప్రద జీవితాన్ని పొందగలం అనే ఆశాజనకమైన ప్రేరణ కలిగించే మాటలు చెప్పాలి. దానివలన ఖచ్చితంగా అనుకూల ప్రభావాన్ని సాదించవచ్చు. ఈ సందర్భంలోనే డీ అడిక్షన్‌ చికిత్స తీసుకోవడానికి మనఃస్ఫూర్తిగా వారిని అంగీకరింప చేయగలిగినట్లయితే మాదక వ్యసనం నుండి బయటపడి తిరిగి సాధారణ జీవితంలోనికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఔషధం కన్నా కౌన్సిలింగే కీలకం
నేడు వైద్య విధానంలో డ్రగ్స్‌ నుండి విముక్తి చేయడానికి అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులోనికి వచ్చినా డ్రగ్స్‌ బారిన పడిన వారిని బయట పడేయడానికి ఔషధాలు కన్నా కౌన్సిలింగ్‌ చాలా బలమైన ప్రభావం చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాదకద్రవ్యాలకు బానిస కావడం అనేది ఒక జబ్బు.వాటికి అలవాటు పడిన వాళ్ళను మనం ఒక రోగిలా మాత్రమే చూడాలి తప్ప నేరగాడిలా చూడకూడదు. పిల్లవాడిని నిర్బంధిస్తే ఆ మహమ్మారి నుంచి బయట పడేయవచ్చు అని భావించే తల్లి తండ్రులు లేకపోలేదు. ఈ తరహా అభిప్రాయం సమస్యను మరింత జఠిలం చేస్తుంది తప్ప పరిష్కారం మాత్రం లభించదు. డ్రగ్స్‌ ఊబి నుంచి బయట పడాలంటే వైద్య సహాయం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల సహకారం అంత కన్నా ఎక్కువ అవసరం. అందుచేత వైద్యులు రోగి కన్నా ముందు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఇది వీరు పాటించగలిగితే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లవాడిని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పకుండా కౌన్సిలింగ్‌ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈ ఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగా చూడాలి. ఇది కనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజయం సాధించినట్లే. దీనిని బట్టి ఔషధం కన్నా కౌన్సిలింగ్‌ కీలకం అని వైద్యుల చేపట్టిన అనేక కేసుల ద్వారా స్పష్టం అయ్యింది.
– రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578

Spread the love