Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతనిఖీలు లేకపోవడంతోనే..

తనిఖీలు లేకపోవడంతోనే..

- Advertisement -

– భద్రతా ప్రమాణాలను పట్టించుకోని పరిశ్రమలు
– కార్మిక చట్టాల సులభతరం సాకుతో ఇష్టారాజ్యం
– కార్మికుల ప్రాణాలకు గండంగా మారబోతున్న లేబర్‌ కోడ్‌లు
– రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తే ప్రమాదాల నివారణ సాధ్యమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలి ఇప్పటికే 13 మంది కార్మికులు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ 26 మందిలోనూ చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శిథిలాల కింద ఇంకా మృతదేహాలుండే అవకాశముంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని సౌత్‌గ్లాస్‌ ఫ్యాక్టరీలోనూ ఇదే తరహాలో రియాక్టర్‌ పేలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలోనే గతేడాది ఎస్‌బి ఆర్గానిక్స్‌ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో పదుల సంఖ్యలో కార్మికులు మరణించారు. అంతకుముందు ముషీరాబాద్‌లోని సామిల్లులో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. వీటన్నింటికీ కారణం పరిశ్రమల్లో ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ తనిఖీలు రెగ్యులర్‌గా లేకపోవడమేనని స్పష్టమవుతున్నది. పెట్టుబడులు వస్తాయనే భ్రమలు చూపెట్టి యాజమాన్యాల లాభాల కోసం తనిఖీలు అవసరం లేదని పాలకులు సర్టిఫికెట్‌ ఇచ్చాక…రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికుల జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. మూడు నెలలకోసారి తనిఖీ నిబంధనలు ఎత్తేశాక, సెల్ఫ్‌ డిక్లరేషన్ల అనుమతి ఇచ్చాక భద్రతా ప్రమాణాలను చాలా పరిశ్రమలు గాలికొదిలేశాయి. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. ఇదిలా ఉండగా, కేంద్రం ప్రభుత్వం అమలు చేయబోతున్న లేబర్‌ కోడ్‌లు కార్మికుల ప్రాణాలకు మరింత గండంగా మారే ప్రమాదం పొంచిఉందనే చర్చ కార్మికవర్గంలో నడుస్తున్నది.

తనిఖీలుంటే ప్రాణాలు నిలిచేవే..
ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు గనుక చేపట్టి ఉంటే పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగకపోయిండేది.. అక్కడ కెమికల్‌ పౌడర్‌ తయారు చేసే క్రమంలో భారీ ఎత్తున ఉత్పన్నమయ్యే వేడిగాలి బయటకు వెళ్లే పైపులైన్‌ వ్యవస్థ సరిగా క్లీన్‌ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. అది గనుక క్లీస్‌ చేసి ఉంటే వేడిగాలి పైపులో జమయ్యేదికాదనీ, విస్పోటనానికి దారి తీసేది కాదనే చర్చ నడుస్తున్నది. ఫార్మా, రసాయన తదితర ప్రమాదకర పరిశ్రమల్లో కెమికల్‌ రియాక్టర్స్‌ పని తీరును సక్రమంగా తనిఖీలు చేయకపోవడం, భద్రతపై తగిన పర్యవేక్షణ లేకపోవడం పరిపాటిగా మారింది. గతంలో కార్మిక, పారిశ్రామిక, పర్యావరణ, తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి ఆకస్మిక తనిఖీలు చేసేవారు. ఆయా విభాగాల నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్లను పరిశ్రమలు పొందడం తప్పనిసరిగా ఉండేది. కానీ, పరిశ్రమలను స్వేచ్ఛగా నడుపుకునేందుకు యాజమాన్యాలకు 2017లో అనేక వెసులుబాట్లను కల్పిస్తూ జీవో నెంబర్‌ 7ని అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ తనిఖీల విషయంలో అనేక మినహాయింపులు ఇచ్చింది. కార్మికుల సంఖ్య అధారంగా లోరిస్క్‌, మిడిల్‌ రిస్క్‌, హైరిస్కు పరిశ్రమలుగా విభజించింది. లో రిస్కు(30 మంది లోపు కార్మికులు) పరిశ్రమల్లో ఐదేండ్లకోసారి, మధ్యస్థ రిస్కు(31 నుంచి 100 మంది కార్మికులు)పరిశ్రమల్లో మూడేండ్ల కోసారి, హైరిస్కు(101కిపైగా కార్మికులు) పరిశ్రమల్లో రెండేండ్లకోసారి తనిఖీలు చేస్తే సరిపోతుందనే వెసులుబాటు కల్పించింది. కొత్త కంపెనీలకు తనిఖీలు అవసరం లేదనే నిబంధననూ తీసుకొచ్చింది. తాజాగా ఆన్‌లైన్‌ తనిఖీల సౌకర్యాన్నీ కల్పిస్తూ పరిశ్రమలకు వెసులుబాటు కల్పించింది. గతంలో అధికారులు నేరుగా వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారం ఉండేది. ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ రెగ్యులర్‌గా పరిశ్రమలకు వెళ్లి అక్కడ వెంటిలేషన్‌ సౌకర్యం ఎలా ఉంది? రియాక్టర్ల పనితీరు ఎలా ఉంది? గాలిచిమ్మీలు సరిగా ఉన్నాయా? లేదా? భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నాయా? లేదా? అనే వాటిని తనిఖీలు చేసేది. ఇప్పుడు అది లేకుండా పోయింది. 15 రోజుల ముందు సమాచారమిచ్చి తనిఖీ చేయాలనే నిబంధనను సర్కారు తీసుకొచ్చింది. పెట్టుబడులు వస్తాయనే సాకు చూపెట్టి ఇలా పరిశ్రమలకు ఇష్టానుసారంగా అనేక మినహాయింపులివ్వడం కార్మికుల ప్రాణాల మీదకు తెస్తున్నది.

లేబర్‌కోడ్‌లతో మరింత ప్రమాదం
పరిశ్రమల యాజమాన్యాలు లాభాలను మరింత పెంచుకునే క్రమంలో భద్రతాప్రమాణాలను సైతం విస్మరిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే లేబర్‌ కోడ్‌లు అమలైతే కార్మికుల ప్రాణాలు గాల్లో దీపం మాదిరిగానే మారే ప్రమాదముంది. భద్రతా ప్రమాణాలు లోపించాయని కార్మికులుగానీ, యూనియన్ల నేతలుగానీ ఫిర్యాదు చేస్తే ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు విధిగా పరిశ్రమల్లో తనిఖీ చేసే వెసులుబాటు ఇప్పటిదాకా ఉండేది. లేబర్‌ కోడ్‌లతో దాన్ని మోడీ సర్కారు ఎత్తేసింది. ప్రభుత్వానికి సమాచారమివ్వకుండా, అనుమతుల్లేకుండా పరిశ్రమల్లో తనిఖీ చేయొద్దని కోడ్‌లలో స్పష్టంగా పేర్కొంది. దీంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రమాదముంది. క్లస్టర్ల పరిధిలో సేప్టీ అధికారులు, ఆంబులెన్స్‌ సౌకర్యముండేది. రానున్నకాలంలో ఇదీ ఉండదు. ఒక పరిశ్రమలో 500 మందికిపైగా కార్మికులుంటేనే సేప్టీ అధికారిని నియమించాలనీ, ఆంబులెన్స్‌ సౌకర్యాన్ని పొందుపర్చాలని కోడ్‌లలో ఉంది. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ప్రాథమిక వైద్య సౌకర్యాలుంటే కొందరి ప్రాణాలు నిలిచేవే. పాశమైలారం క్లస్టర్‌ పరిధిలో ఆంబులెన్స్‌లు లేకపోవడంతో ప్రమాదం జరిగిన తర్వాత 30 నుంచి 50 శాతానికిపైగా కాలిన గాయాలతో ఉన్న వారిని పరిశ్రమ బస్సులో తీసుకెళ్లిన విషయం విదితమే. కార్మిక చట్టాలున్నప్పుడే ఆంబులెన్స్‌ సౌకర్యాన్ని విస్మరించిన యాజమాన్యాలు కోడ్‌లు అమల్లోకి వస్తే వాటిని పాటిస్తాయా? అన్నది ధర్మసందేహమే. అందుకే కార్మిక కోడ్‌లను కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది.

కార్మిక చట్టాల సవరణ…యాజమాన్యాలకు వెసులుబాటు వల్లనే ఘటనలు పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరం. అత్యంత దారుణమైన ఘటన ఇది. యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం సాచివేత ధోరణికి ఇది పరాకాష్ట. కార్మిక చట్టాలను సవరిస్తూ పదేపదే పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కార్మిక శాఖ కార్మికుల సంక్షేమాన్ని చూడాలి. పరిశ్రమల శాఖ భద్రతా ప్రమాణాలను మూడు నెలలకోసారి చూడాలి. ఇవేమీ జరగడం లేదు. వీటికి కారణం కార్మిక చట్టాల్లో వస్తున్న మార్పులు, లేబర్‌ కోడ్‌లే కారణం. చనిపోయిన వారిలో వలస కార్మికులున్నట్టు తెలుస్తోంది. ఏ పరిశ్రమలో కూడా 1979 వలస కార్మికుల చట్టం ఎక్కడ కూడా అమలు కావడం లేదు. లాభాలే పరమావధిగా పరిశ్రమలు వ్యవహరిస్తున్నాయి. యాజమాన్యాలు అన్నీ బాగున్నాయని సొంత ధ్రువీకరణ చేస్తే ఎలా సరిపోతుంది? అలాంటప్పుడు అవి భద్రతా ప్రమాణాలను ఎలా పాటిస్తాయి. లేబర్‌కోడ్‌లు రాకుండానే ఈ పరిస్థితి ఉంది. అవి అమల్లోకి వస్తే కార్మికులు దినదినగండంగా పనిచేయాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -