– ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కంపించిన భూమి
– ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో కలవరం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ ఆదిలాబాద్
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చైతన్యపురి, కిసాన్ నగర్, విద్యారణ్యపురి, కమాన్ ఏరియాలతో పాటు ఇతర ప్రాంతాల్లో 2-5 సెకన్లపాటు భూమి కంపించింది. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, కడెం, జన్నారంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇండ్లలో ఫర్నీచర్, వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్, రాంపూర్, తపాలాపూర్, జన్నారం, బంగారుతండా, కలమడుగు, బాదంపల్లి తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం 6:53 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. దాదాపు 10 నుంచి 20 సెకండ్లపాటు కంపించినట్టు ప్రజలు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్, శ్రీరామ్‌నగర్, బస్టాండ్, జెకె నగర్, పద్మావతి నగర్, మస్కాపూర్ గ్రామంలోని మధురనగర్ ఆయా కాలనీలో పది సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనలతో అక్కడి ప్రజలు ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చారు.
ఎర్త్ క్వేక్ అనాలసిస్ ముందస్తు హెచ్చరికలు
ఏప్రిల్ 10, 2025న ‘ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ సంస్థ రాష్ట్రంలో, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపం నమోదైంది. అయితే, ఈ హెచ్చరికలను అధికారిక శాస్త్రీయ సంస్థలు ధృవీకరించలేదు. తెలంగాణ భూకంప తీవ్రతలో తక్కువ రిస్క్ ఉన్న జోన్-2లో ఉన్నప్పటికీ, గోదావరి పరివాహక ప్రాంతంలోని ఫాల్ట్ జోన్ కారణంగా అప్పుడప్పుడూ స్వల్ప ప్రకంపనలు సంభవిస్తుంటాయి.
భూప్రకంపనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES