Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసోషల్ మీడియా ప్రచారంపై ఈసీ కొత్త రూల్స్..!

సోషల్ మీడియా ప్రచారంపై ఈసీ కొత్త రూల్స్..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియా, వెబ్‌సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రతి ప్రకటనకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ బుధవారం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్, జమ్మూ కశ్మీర్‌తో పాటు ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రకటనల కంటెంట్‌ను పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ‘మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు’ (ఎంసీఎంసీ) ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కమిటీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే పార్టీలు, అభ్యర్థులు తమ ప్రకటనలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధన కేవలం ప్రకటనలకే పరిమితం కాదు. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు, పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ ప్లాట్‌ఫాంల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ప్రకటనల రూపకల్పన (కంటెంట్ క్రియేషన్) కోసం అయిన ఖర్చుతో సహా, ప్రచారానికి సంబంధించిన పూర్తి వ్యయ వివరాలను ఎన్నికలు ముగిసిన 75 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. వివిధ మీడియా మాధ్యమాలలో వచ్చే వార్తలను ఎంసీఎంసీ బృందాలు నిశితంగా గమనిస్తాయని, పెయిడ్ న్యూస్ అని అనుమానం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలతో డిజిటల్ ప్రచారంపై పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -