నవతెలంగాణ – హైదరాబాద్: జగదీప్ ధన్‌కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తు పూర్తవగానే ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడంలో, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఎన్నికల సంఘం బిజీ అయిపోయింది.
ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవి ఖాళీకాగానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తోంది.అనారోగ్య కారణాలతో తాను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ జగదీప్ ధన్‌కడ్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా పంపారు. రాష్ట్రపతి నిన్న ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర హోంశాఖకు పంపారు. కేంద్ర హోంశాఖ ఉపరాష్ట్రపతి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని పార్లమెంట్ ఉభయసభలకు సభాధ్యక్షుల ద్వారా తెలియజేసింది.