నవతెలంగాణ-హైదరాబాద్: అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడిందని విమర్శంచారు.ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయకుడా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టుకుండా అప్పులతో ఏం చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కే. తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీగా ఖతం పట్టించిందని మండిపడ్డారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావించిన కేటీఆర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు.
అప్పుల్లో తెలంగాణ.. లోటు బడ్జెట్‌తో ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని కేటీఆర్ ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పుడు ₹ 10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయిందని తెలిపారు.
నిధులు ఎటు పోతున్నాయి?
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతీ రోజు అప్పు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇప్పటికే ₹ 20,266 కోట్లు అప్పుగా తీసుకుందని కేటీఆర్ తెలిపారు. వార్షిక లక్ష్యంలో ఇది 37.5 శాతం అన్న కేటీఆర్, కొత్తగా ఏ రోడ్లు వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులను ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్‌లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.