Thursday, May 22, 2025
Homeజాతీయంఈడీ అన్ని పరిమితులను దాటుతోంది: సుప్రీంకోర్టు

ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది: సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)కి సుప్రీంకోర్టు గురువారం చీవాట్లు పెట్టింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పోరేషన్‌ (టిఎఎస్‌ఎంఎసి) కార్యాలయాలపై ఈడీ జరిపిన దాడులపై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. ఒక కార్పోరేషన్‌ (సంస్థ) ఎలా నేరం చేయగలదని, ఈడీ అన్ని పరిమితులను దాటుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర కార్పోరేషన్‌పై ఈడి చర్యలు దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘించాయని అన్నారు. కార్పోరేషన్‌పై క్రిమినల్‌ నేరం ఎలా నిరూపించబడుతుందని సీజేఐ ప్రశ్నించారు. వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు కానీ కార్పోరేషన్‌పై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.

కార్పోరేషన్‌పై ఈడీ దర్యాప్తు, దాడులపై స్టే విధించడాన్ని తిరస్కరిస్తూ ఏప్రిల్‌లో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, టిఎఎస్‌ఎంఎసిలు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు గురువారం విచారించింది.

అవినీతి ఆరోపణలపై మద్యం దుకాణాల నిర్వాహకులపై రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని తమిళనాడు తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలిపారు. 2025లో ఈడి రంగంలోకి దిగి, టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి, అక్కడ దొరికిన ఫోన్‌లు, పరికరాలను స్వాధీనం చేసుకుంది.

ఈ కేసు దర్యాప్తులో రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఈడి తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి. రాజు పేర్కొన్నారు. ఈ కేసులో రాజకీయ నేతలు కూడా ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రం అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసినప్పటికీ ఈడి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈడి దర్యాప్తు చేపట్టడానికి కారణమైన నేరం గురించి ప్రశ్నించింది. వివరణాత్మక ప్రతిస్పందన దాఖలు చేసేందుకు రెండు వారాల సమయం ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -