ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐసి ఘోష్
అమరావతి: ప్రభుత్వ రంగం బలోపేతం ద్వారానే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, జేఎన్‌యూ విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షురాలు ఐసిఘోష్ అన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలను బలహీనపరుస్తోందని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐతో పాటు మేధావులు, విద్యావేత్తలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం ప్రమాదకరమైనదని హెచ్చరించారని, అయినా, కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. విద్య ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ వైపుగా అడుగులు వేశారన్నారు. రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం అమలు చేయడం ద్వారా గత నాలుగేండ్ల కాలంలో సుమారు 6వేల పాఠశాలలు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నాలుగేండ్ల విధానం కారణంగా డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రభుత్వ యూనివర్శిటీలకు నిధులు కేటాయించకుండా ప్రయివేట్, డీమ్డ్ యూనివర్శిటీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని ఐసిఘోష్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం 10మెడికల్ కాలేజీలను పీపీపీి మోడ్‌లో ప్రయివేట్ వాళ్లకు అప్పజెప్పడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయా కళాశాలలు ప్రయివేట్‌పరమైతే వైద్య విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోవడమే కాకుండా పేద ప్రజలకు వైద్యం భారంగా మారుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్నకుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా విద్యార్ధి సంఘాలు సమస్యలు ఉంటే చర్చలకు రావాలని పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్నా నేటికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కనీసం సమస్యలపై పోరాటాలు చేస్తున్న సంఘాలతో మాట్లాడలేదన్నారు. ఆంధ్రయూనివర్శిటీ విద్యార్థి మణికంఠ మరణం యాధృశ్చికంగా జరిగిందికాదని, ప్రభుత్వం, యూనివర్శిటీ అధికారుల వైఫల్యమే కారణమన్నారు. విద్యార్థి సంఘాలు విద్యార్ధికి న్యాయం చేయాలని కోరితే రాజకీయాలు అంటగట్టడం సిగ్గు చేటన్నారు. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ నూ.6,400కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తే కేవలం రూ.400కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారని వారు విమర్శించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, గార మండలాల్లో చనిపోయిన విద్యార్థినులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాడుతుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రణీత, షణ్ముఖ్ పాల్గొన్నారు.
ప్రభుత్వరంగ బలోపేతం ద్వారానే విద్యాభివృద్ధి
- Advertisement -
- Advertisement -