జిల్లాలో ప్రశాంతం గా ముగిసిన మున్సిపల్ చైర్మెన్/ వైస్ చైర్మన్ ల ఎన్నికల ప్రక్రియ
ఎస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం నల్లగొండ కార్పోరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ తోపాటు మరో 6 మున్సిపాలిటీలలో చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా భారీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియలో పోలీస్ బందోబస్తును ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించిన మేయర్/ డిప్యూటీ మేయర్, చైర్మన్/ వైస్ చైర్మన్ ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ , తెలిపారు.
ఎన్నికల బందోబస్త్ ప్రక్రియను పర్యవేక్షించిన ఎస్పీ మాట్లాడుతూ. ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ ప్రక్రియను కాపాడేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది అని చెప్పారు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి దశలోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసి,అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా గుంపులు గుమికూడడం, నినాదాలు చేయడం, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలను పూర్తిగా నిషేధించి శాంతి భద్రతలను కాపాడినట్లు వివరించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా పరిస్థితులను సమీక్షిస్తూ ఎటువంటి శాంతి భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఈ ఎన్నికల ప్రక్రియలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వెంట నల్లగొండ డి.ఎస్.పి శివరామిరెడ్డి పోలీసు సిబ్బంది ఉన్నారు.



