– కార్యకర్తలకు అన్యాయం జరగనీయం
– ప్రభుత్వ హామీల అమలు పరిశీలన కోసమే పాదయాత్ర :కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
– బీజేపీ ఎంపీల వల్లే బీసీలకు అన్యాయం : పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్
– యాత్ర రెండోరోజు ఎస్సీ హాస్టల్‌లో శ్రమదానం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/గంగాధర
బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌లా ఎన్నికల సంఘం పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల త్యాగ ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వారిని విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర రెండో రోజు సోమవారం గంగాధరలో సాగింది. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్‌గౌడ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమయ్యాయి.
గంగాధర మండలం కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో మొక్కలు నాటి, పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజల్లో సేవా భావం పెంపొందించడమే ఈ శ్రమదానం ప్రధాన ఉద్దేశమని మీనాక్షి నటరాజన్ తెలిపారు. అనంతరం వెంకటయ్యపల్లిలోని ఎల్‌కే గార్డెన్‌లో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రేణులతో, నియోజక వర్గాల ఇన్‌చార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పాత కార్యకర్తలకు అన్యాయం జరగదు : మీనాక్షి నటరాజన్
అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్టు మీనాక్షి నటరాజన్ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకా లు సోనియా గాంధీ గ్యారంటీలు అని, వాటిని ఐదేండ్లలో ఒక్కొక్క టిగా అమలు చేస్తామని చెప్పారు. ఓట్ల చోరీని అరికట్టడానికి ఓటర్ల జాబితా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి అవకాశాలు ఉంటాయని, కానీ పాత కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఆ పార్టీలకు కడుపునొప్పి : టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్
జనహిత పాదయాత్ర వల్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌కు కడుపు నొప్పి వస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. కార్యకర్తల త్యాగ ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వారిని విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, పాత కార్యకర్తలకు అన్యాయం జరగదని అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజరు వ్యాఖ్యల వల్లే బీసీ బిల్లు పెండింగ్‌లో ఉందని ఆరోపించారు. 12 ఏండ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. 42 బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 5.8 శాతం మాత్రమే వర్తిస్తుందని, బీజేపీ 10 శాతం అని తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. బీజేపీ ఎంపీల వల్ల బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై జస్టిస్ ఘోష్ కమిషన్ దోషులను తేల్చినా, బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌లా ఎన్నికల సంఘం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES