నవతెలంగాణ-హైదరాబాద్:దేశ పార్లమెంట్‌లోని ఎగువ సభలో భారీ మొత్తంలో సీట్లు ఖాళీ కానున్నాయి. ఆర్నేండ్ల పదవీకాలం ముగియడంతో బడా పార్టీలకు చెందిన రాజకీయ కురు వృద్ధులు పెద్దల సభను వీడనున్నారు. ఐదేండ్ల కాలానికి లోక్ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా దేశంలోని రాష్ట్రాల తరుపున ప్రాతినిధ్యం వహించే పెద్దల సభకు ఆరు ఏండ్లేకు ఒక్కసారి 1/3 వంతు సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో ఆర్నేండ్ల పదవీకాలం ముగియడంతో రాజ్యసభలో ఈ సారి మొత్తం 73 స్థానాలు ఖాళీ కానున్నాయి. రాజకీయంగా అగ్రనాయకులు రాజ్యసభకు వీడ్కోలు పలకనున్నారు. వీరిలో పలువురు పునర్ ప్రవేశం చేయనుండగా, మరికొందరు పదవులకు దూరం కానున్నారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్(నామినేటెడ్ ఎంపీ) సభ్యుల పదవీకాలాలు ముగుస్తాయి. పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్లీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.
మిగతా వాళ్లలో.. వయసు రీత్యా వీళ్లలో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఏపీ నుంచి నలుగురు ఉండగా, అందులో జూన్ 21వ తేదీన వైఎస్సార్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని.. తెలుగు దేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు ఉన్నారు. తెలంగాణ నుంచి రిటైర్ కానున్న ఇద్దరు ఎంపీలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ రిటైర్ కానున్నారు.
అయితే రాష్ట్రాల వారీగా అధికంగా యూపీలో 10 సీట్లు, తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆరుగురు, పశ్చిమ బెంగాల్ లో ఐదు స్థానాలు ఖాళీ కానున్నాయి. బీహార్ 5, మహారాష్ట్ర,ఒడిశా,గుజరాత్, కర్ణాటకల్లో నాలుగు, చత్తీస్‌గడ్, హర్యానా, జార్ఖండ్ రెండు, మధ్యప్రదేశ్,రాజస్థాన్ 3, హిమాచల్ ప్రదేశ్,మణిపూర్,మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రల్లో ఒక్కో స్థానం ఖాళీ కానుంది.
మరోవైపు ఈ ఎన్నికలతో ఎన్డీఏ (NDA), ఇండియా కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. మొత్తం రాజ్యసభలో గరిష్టంగా 250 సభ్యులకు గాను 238 ప్రతినిధులను పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. అదే విధంగా వివిధ రంగాలల్లో నిపుణులైన 12మంది వ్యక్తులను రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయనున్నారు. అయితే త్వరలో ఖాలీ కానున్న 73 సీట్లకు.. ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏప్రిల్లో తొలి విడత, నవంబర్‌లో రెండు విడతలలో జరిగే అవకాశం ఉంది.



