– గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
– పలు ప్రాంతాల్లో నిలిచిన పనులు యంత్రాలు లేక ఆందోళనలో ఉద్యోగులు
– బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యంపై నిరసనఆలస
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలూ ఎదురవకుండా పనులు చేపట్టే కాంట్రాక్టర్లు మూడ్రోజులుగా సమ్మెలో ఉన్నారు. తాము చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా సంబంధిత ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పెండింగ్ పెడుతున్నారని ఆరోపిస్తూ కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనులు నిలిచిపోయాయి. సహాయ నిరాకరణ చేపట్టడంతో సోమవారం జిల్లాలోని తలమడుగు మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద టిప్పర్ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢ కొట్టింది. అది విరిగిపోవడంతో దేవాపూర్, భరంపూర్, కజ్జర్ల, పల్లి తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో డీఈ, ఏఈ, లైన్‌మెన్లు మరమ్మతు పనుల్లో నిమగమయ్యా రు. యంత్రాలు లేకపోవడంతో ప్రయివేటు కూలీలను నియమించి పనులు చేపట్టారు. దీంతో రోజంతా ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
జిల్లా అంతటా నిలిచిన పనులు
జిల్లాలో పనిచేస్తున్న 50మంది విద్యుత్ కాంట్రాక్టర్లు సమ్మె చేపట్టడంతో పలుచోట్ల పనులు నిలిచిపోయాయి. వారు విద్యుత్ స్తంభాలు పాతడం, ట్రాన్స్‌ఫార్మర్లు బిగించడం, తీగలు వేయడం ఇలా అనేక పనులు చేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఏర్పడినా వెనువెంటనే పనులు పూర్తి చేస్తుంటారు. ఉద్యోగులతో కాని పనులు కాంట్రాక్టర్లు తమ వద్ద ఉన్న యంత్రాలతో త్వరితగతిన పూర్తి చేయిస్తుంటారు. అలాంటిది వారు సమ్మె చేపట్టడంతో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో కాంట్రాక్ట ర్లు సమ్మె చేయడం సరికాదని అంటున్నారు.
నెలల తరబడి చెల్లింపులు నిలిపివేత
గతంలో పనులు చేశాక ప్రతి నెలా చివరి వారంలో కాంట్రాక్టర్లు బిల్లులు పెట్టుకుంటే.. నెల మొదటి వారంలో మంజూరయ్యేవి. ప్రస్తుతం ఓ అధికారి నిర్లక్ష్యం వల్ల నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. నెలకు సుమారు రూ.కోటి బిల్లులుంటాయి. దీనికంతటికి జూనియర్ అకౌంటెంట్ కారణమని సదరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో తాము సమ్మెకు దిగినట్టు చెబుతున్నారు. అధికారిపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ అధికారి కారణంగా ఆదిలాబాద్, ఉట్నూర్ డివిజన్లలో కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. యంత్రాలను విద్యుత్ శాఖ కార్యాలయంలో నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సీఎండీ దృష్టికి తీసుకెళ్తాం..
బిల్లుల విషయంలో డీఈ, ఎస్‌ఈ సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. సమ్మె కాలంలో సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేనిపక్షంలో ఎంత కాలమైనా సమ్మెలో ఉండేందుకు కాంట్రాక్టర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు
రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం
ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలి..
జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గోపాల్‌రావు బిల్లులు పెండింగ్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడు. అనేక సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. బిల్స్ మంజూరు చేయమంటే చేయను..దిక్కున్న చోట చెప్పుకో అని అంటున్నాడు. చేసేదేమీ లేక సమ్మె చేపట్టాం. బిల్లులు మంజూరు చేసి సదరు అధికారిని బదిలీ చేసే వరకూ సమ్మె చేస్తాం.
ప్రకాష్ జాదవ్, విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షులు
విద్యుత్ కాంట్రాక్టర్ల సమ్మె
- Advertisement -
- Advertisement -