Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకరెంటోళ్ల సమ్మె తాత్కాలిక వాయిదా

కరెంటోళ్ల సమ్మె తాత్కాలిక వాయిదా

- Advertisement -

– తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ వెల్లడి
నవతెలంగాణ-సిటీబ్యూరో :
నెల 14న కరెంటోళ్ల నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌-జేఏసీ వెల్లడించింది. హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) కార్యాలయం వద్ద శనివారం విలేకర్ల సమావేశంలో జేఏసీ నేతలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌-జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ ఈశ్వర్‌రావు మాట్లాడుతూ.. కార్మిక శాఖ జోక్యం చేసుకుని సమ్మెపై కన్సిలేషన్‌ చేసిందని, ఈ నెల 10న కన్సిలేషన్‌ సమావేశం జరిగిందని తెలిపారు. ఇది 20వేల మంది విద్యుత్‌ ఆర్టిజన్స్‌ పర్మినెంట్‌ సమస్య కావడంతో సీఎం, డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రితో చర్చించాల్సి ఉండగా రెండు వారాల సమయం కోరినట్టు తెలిపారు. కానీ, టీవీఏసీ-జేఏసీ నాయకులు యాజమాన్యానికి సమయం ఇవ్వడానికి నిరాకరించామన్నారు. అయితే, కన్సిలేషన్‌ ఆఫీసర్‌ జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సునిత జోక్యం చేసుకుని.. ఎమర్జెన్సీ సర్వీస్‌ అని, మళ్లీ ఈనెల 23న కన్సిలేషన్‌ సమావేశం ఏర్పాటు చేశామని, అప్పటి వరకు ఆగాలని సూచన చేసినట్టు చెప్పారు. ఈ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌ సంస్థల్లో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ కోసం (విద్యార్హతలను బట్టి పోస్టింగ్‌ ఇవ్వాలని) 10 నెలలుగా అనేక రకాలుగా పోరాటం చేశారని తెలిపారు. వేల మందితో విద్యుత్‌ సౌధను ముట్టడించామన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్‌ఈ కార్యాలయాల వద్ద 5 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశామని తెలిపారు. అయినా యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, కనీసం స్టాండింగ్‌ ఆర్డర్‌లో పొందుపర్చిన గ్రేడ్‌ ఛేంజ్‌, ఇంక్రిమెంట్‌ కూడా ఆర్టిజన్‌ కార్మికులకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఆర్టిజన్స్‌ను కన్వర్షన్‌ చేయడం వల్ల ప్రభుత్వపైగానీ, విద్యుత్‌ సంస్థలపైగానీ ఎలాంటి ఆర్థిక భారమూ పడదని తెలిపారు. కన్వర్షన్‌ చేయడం వల్ల ఉద్యోగ భద్రత ఏర్పడుతుందని, ఆత్మ గౌరవం పెరుగుతుందని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ శాశ్వత ఉద్యోగుల్లాగా వస్తాయని తెలిపారు. ఒకే సంస్థలో రెండు సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తున్నారని, ఇంజినీర్లకు, శాశ్వత ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ రూల్స్‌, ఆర్టిజన్స్‌కి స్టాండింగ్‌ ఆర్డర్‌ రూల్స్‌ అమల్లో ఉన్నాయని, ఇది చట్ట వ్యతిరేకం అని తెలిపారు. ఒకే సంస్థ, ఒకే రూల్‌ అమలు చేయాలని కోరారు. 20వేల మందిలో 16 వేల మంది సబ్‌స్టేషన్‌ ఆపరేటర్లు, ఫీల్డ్‌లో పని చేసే కార్మికులు, జనరేటింగ్‌ స్టేషన్స్‌లలో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే కీలక ప్రదేశాల్లో పని చేస్తారని, వీరందరూ సమ్మెలోకి వస్తే రాష్ట్రం ‘చీకటి’ అవ్వటం అనివార్యం అని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం చేయకుం టే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌-జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంఎ.వజీర్‌, రాష్ట్ర కో-చైర్మెన్లు జి.నాగరాజు, వి.నరేందర్‌, నాయకులు పి.కోటిగౌడ్‌, కె.లింగం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -