నవతెలంగాణ – జుక్కల్
99 రోజుల ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 99 రోజుల సంబంధించి ఎనిమిదవ రోజు శుక్రవారం జుక్కల్ మండల కేంద్రం నుండి రోడ్లు మరియు భవనాల శాఖ రోడ్డుకు ఇరువైపులా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించినట్టు జుక్కల్ ఎంపీపీ ఓ.రాము తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీపీ ఓ.రాము మాట్లాడుతూ మండల కేంద్రం నుండి ఏరివేత కార్యక్రమం మండలంలోని జుక్కల్, కేమ్రాజ్ కల్లాలి, కౌలాస్ గ్రామా పంచాయితీలకు చెందిన పారిశుద్ధ కార్మికులతో ఏరివేత కార్యక్రమం చేపట్టామని, రోడ్డుకు ఇరువైపులా మద్యం తాగి పడేసిన సీసాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ , ఇతర వ్యర్థాలను ట్రాక్టర్ ద్వారా తొలగించామని పేర్కొన్నారు.
మండల కేంద్రంతో పటు గ్రామాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు పడేయవద్దని వాటిని వెంటనే అగ్నికి ఆహుతి చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకం వలన ఆరోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీవో తో పాటు మూడు గ్రామాల జిపి పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.



