పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ వరంగల్ సర్కిల్ అధికారి నిర్వాకం
ఈఈల అకౌంట్‌కు చేరాల్సిన డిపాజిట్లు..
కంప్యూటర్ ఆపరేటర్ ఖాతాకు..!
బిడ్డర్లకు వాపసు ఇవ్వకుండా
రూ.కోట్ల నిధుల దారిమళ్లింపు..!!
ఏసీబీ, విజిలెన్స్ దృష్టి పెడితే…1 శాతం
ఈఎండీ దుర్వినియోగం బట్టబయలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)లు గోల్‌మాల్ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎం డిపాజిట్లు రూ.40 లక్షలను కొందరు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై పక్కదారి పట్టించారు. ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ వరంగల్ సర్కిల్ అధికారి కార్యాలయంలోనూ ఇటువంటి తంతే కొనసాగుతున్నట్టు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రూ.కోట్ల అభివృద్ధి పనులకు చెందిన 1 శాతం ఈఎండీపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు దృష్టి పెడితే అవకతవకలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. బిడ్డర్లకు వాపసు ఇవ్వకుండా రూ.కోట్ల అభివృద్ధి పనుల డిపాజిట్లను దారి మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈఈల అకౌంట్‌కు చేరాల్సిన డిపాజిట్లు అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఖాతాకు చేరుతుండటంపై అనుమానాలు నెలకొన్నాయి. టెండర్‌లో పాల్గొనే బిడ్డర్లు తమ నిబద్ధతకు గుర్తుగా భద్రతా డిపాజిట్‌ను చెల్లిస్తారు. ఒకవేళ ఆ బిడ్డర్‌కు ఆ బిడ్ దక్కకపోతే ఆ డిపాజిట్ మొత్తం తిరిగి ఇవ్వాలి. బిడ్డర్ టెండర్‌ను దక్కించుకుని నిబంధనలు పాటించకపోతే ఈఎండీని జప్తు చేసే అధికారం ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఉంటుంది.
ఎస్‌ఈ కార్యాలయంలో దారిమళ్లుతున్న ఈఎండీలు
వరంగల్ సర్కిల్ పీహెచ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ) పర్యవేక్షణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ సర్కిల్ పరిధిలో ఈ- ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించిన 1 శాతం ఈఎండీ దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈఎండీలను ఆయా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల ఖాతాలకు మళ్లించాలనే నిబంధన ఉన్నా.. ఎస్‌ఈ నాగవల్లి శ్రీనివాసరావు ఓ ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఖాతాలో జమ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్ ఖరారు అయిన తర్వాత ఒప్పంద దశకు ముందు బిడ్డర్లకు ఇవ్వాల్సిన ఈఎండీ మొత్తాలను వాపసు ఇవ్వటం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎస్‌ఈ, కంప్యూటర్ ఆపరేటర్ కుమ్మక్కై ఈ డిపాజిట్ మొత్తాన్ని వెనక్కు ఇవ్వకపోవటంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈఎండీలను ఆటోమేటెడ్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ద్వారా వాపసు చేయాల్సి ఉన్నా ఆ ప్రక్రియ ఇక్కడ అమలు కావటం లేదని ఆరోపణలొస్తున్నాయి.
సర్కిల్ పరిధిలో
1 శాతం ఈఎండీలు మచ్చుకు కొన్ని..
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ వరంగల్ సర్కిల్ పరిధిలో 1 శాతం ఈఎండీలు మచ్చుకు కొన్ని.. బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సిట్టిపేట్, మందమర్రి, నాస్‌పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్‌లో దోబీఘాట్ల నిర్మాణానికి సంబంధించి రూ.14,39,517 ఈఎండీలు 2023లో ఎస్‌ఈ కార్యాలయానికి జమయ్యాయి. కోరుట్ల, జగిత్యాలలోనూ రూ.2.9 లక్షల 1 శాతం ఈఎండీలు నమోదు చేశారు. ఇదే ఏడాది మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాల్టీకి సంబంధించి తాగునీరు, డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణం కోసం ఈఎండీలు ఈ- ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించారు. ఇవేవీ టెండర్ దక్కని బిడ్డర్లకు వాపస్ రానట్టు తెలుస్తోంది. ఇవి కొన్ని మాత్రమే.. ఇలాంటి కోట్ల రూపాయల 1 శాతం ఈఎండీలను తిరిగి ఇవ్వకుండా ఎస్‌ఈ తాత్సారం చేస్తున్నారని బిడ్డర్లు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘ఈఈ ఇవ్వలేదా..? నేను చెబుతాను లే..!’ అని కాలయాపన చేస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఇలా రూ.కోట్ల ఈఎండీలు వెనక్కు ఇవ్వకపోతే తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి విజిలెన్స్, ఏసీబీతో దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 18 జిల్లా పరిధిలోని కాంట్రాక్టర్లను సేవ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి మెరుగైన బిడ్‌లు నమోదయ్యే ఆస్కారం ఉంటుంది. దీనిపై ఎస్‌ఈ శ్రీనివాసరావు వివరణ కోసం పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఏండ్ల తరబడీ ఎస్‌ఈ ఇక్కడే తిష్ట
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ వరంగల్ సర్కిల్ ఎస్‌ఈగా శ్రీనివాసరావు సుదీర్ఘ కాలంగా ఇక్కడే కొనసాగుతున్నారు. ఏఈ మొదలు డీఈ, ఇప్పుడు ఎస్‌ఈగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్కిల్ పరిధిలోని కాంట్రాక్టర్ల తీరును ఆయన పసిగట్టారు. ఈఎండీల వాపస్ విషయమై కాంట్రాక్టర్లు ప్రశ్నించకుండా ఏమి చేయాలో ఆయన తెలుసుకున్నారు. కాంట్రాక్టు పరంగా తలెత్తే లోటుపాట్లను అనుకూలంగా మలుచుకుంటూ ఈఎండీలను ఎగవేస్తు న్నారని, వాటిని తన బినామీ అయిన కంప్యూ టర్ ఆపరేటర్ అకౌంట్‌లో జమ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్క్‌లు, బిల్లులు ఇచ్చినప్పుడు తీసుకునే కమీషన్‌లు చాలవని ఈఎండీలను సైతం కైంకర్యం చేస్తుండటంపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



