నవతెలంగాణ-హైదరాబాద్: ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తదుపరి మూడేళ్ల బ్లాక్ పీరియడ్ (2025-26, 2026-27, 2027-28) కోసం రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ జీవో 6ను జారీ చేసింది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చే ఈ కొత్త ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఫీజును సీబీఐటీలో రూ. 1,83,000గా నిర్ణయించారు. మిగిలిన టాప్ కాలేజీల విషయానికొస్తే.. వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో రూ. 1,75,000, ఎంజీఐటీలో రూ. 1,67,000, సీవీఆర్ కాలేజీలో రూ. 1,63,000, జి.నారాయణమ్మలో రూ. 1,62,000, గోకరాజు గంగరాజులో రూ. 1,60,500, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో రూ. 1,59,600, బీవీరాజు ఇనిస్టిట్యూట్‌లో రూ. 1,46,600, కిట్స్‌లో రూ. 1,46,200 మరియు ఎంవీఎస్ఆర్ కాలేజీలో రూ. 1,43,800 చొప్పున ఫీజులు నిర్ణయించారు.



