Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపర్యావరణ క్షీణత అత్యంత ప్రమాదకరం

పర్యావరణ క్షీణత అత్యంత ప్రమాదకరం

- Advertisement -

– అడవులను పునరుద్ధరించండి : సీపీఐ జాతీయ కార్యదర్శి ఎస్‌ అజీజ్‌ పాషా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పర్యావరణ క్షీణత అనేది అత్యంత ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్‌), ఆల్‌ ఇండియా తంజీమ్‌ -ఏ – ఇన్సాఫ్‌ సంయుక్తాధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని భూమి మనుగడ, మన ప్రాధాన్యత. భూమి అందం మన కర్తవ్యం. ఆకుపచ్చగా ఆలోచించండి, శుభ్రంగా జీవించండి, రేపటి కోసం ఈరోజే భూమిని కాపాడుకుందామంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అజీజ్‌ పాషా మాట్లాడుతూ గ్లోబల్‌ వార్మింగ్‌లో ప్రపంచంలోనే భారత దేశం నెంబర్‌ టు గా ఉందని గుర్తు చేశారు. అందులో దక్షిణ భారత దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందనీ, ఇది ప్రజల జీవితాలు, జీవనోపాధికి హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభా, ప్రబలమైన పారిశ్రామికీకరణ, ప్రభుత్వాల తిరోగమన విధానాలు పర్యావరణానికి భారీ ముప్పును కలిగిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా 2014 నుంచి 2024 వరకు 11,422 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసారు. వాతావరణ సంక్షోభం, క్షీణిస్తున్న గాలి నాణ్యత, అటవీ నిర్మూలన, ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగం ప్రజల జీవితాలను ప్రమాదంలో పడవేస్తున్నాయని వాపోయారు. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌ కు నిదర్శనమని చెప్పారు. పట్టణ ప్రకృతి దృశ్యానికి ప్రాణం పోసే కంచ గచ్చిబౌలి అడవిని రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ కోసం వేలం వేసేందుకు ప్రయత్నించటం శోచనీయమన్నారు. అక్కడ ఉన్న సహజ గడ్డి, చెట్లను నరకడం, వన్యప్రాణులకు హాని జరగడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఆ భూములు రక్షించబడ్డాయని చెప్పారు. కార్యక్రమంలో ఇస్కఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేఖల గోపాల్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కడారి ప్రభాకర్‌, నాయకులు ఎ. విజయ లక్ష్మి, ఇన్సాఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మునీర్‌ పటేల్‌, సీపీిఐ ముషీరాబాద్‌ నియోజకవర్గం సహాయ కార్యదర్శి సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad