కాలం ఎంత మారినా సమాజంలో మహిళను చూసే విధానం మాత్రం మారడం లేదు. భర్త ఎంత హింసించినా భరించాలనే చెబుతుంటారు. ‘ఇక అతనితో బతకలేను, విడాకులు తీసుకుంటాను’ అని ఏ మహిళైనా అంటే ఇక ఆమెను చూసే విధానమే మారిపోతుంది. మన సమాజంలో విడాకులు తీసుకున్న తర్వాత జీవితం మగాళ్లకున్నంత సులువగా మహిళలకు ఉండదు. సూదుల్లాంటి చూపులతో గుచ్చి గుచ్చి చంపుతారు. తప్పంతా ఆమెదే అన్నట్టు సూటి పోటి మాటలతో వేధిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వెలివేసినంత పని చేస్తారు. చివరకు కొందరినైతే కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా చేరదీయరు. ఇలాంటి వారి కోసమే రఫియా ఆఫీ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే డివోర్సీ క్యాంప్స్. ఆ వివరాలంటే మనమూ తెలుసుకుందాం…
శ్రీజకు 28 ఏండ్లు ఉంటాయి. ఇద్దరు పిల్లలున్నారు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఇటీవలె అతని నుండి విడాకులు తీసుకుంది. పిల్లలతో పుట్టింట్లో ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. తల్లి పిల్లల్ని చూసుకుంటుంది. కానీ చుట్టూ చూసే చూపులు, వచ్చిపోయే బంధువులు అనే మాటలు భరించలేక పోయింది. కొన్ని రోజులకు వేరే ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి అక్కడే ఉంటుంది. తన జీవితంలో ఆనందమే దూరమయ్యింది. తనేదో తప్పి చేసినట్టు అందరూ ఎందుకు ఇలా మాటలు అంటున్నారో అర్థం కాక మానసికంగా కుంగిపోతోంది. శ్రీజలాంటి మహిళలు మన చుట్టూ ఎందరో ఉంటారు. అసలే బాధలో ఉన్న వారిని మరింత బాధపెడుతుంటారు. హింసా జీవితం నుండి బయటపడి తన బతుకు తాను బతుకుతున్నా ఏవో మాటలతో జనం బాధపెడుతూనే ఉంటారు. అలాంటి వారందరికి ఇప్పుడు డివోర్సీ క్యాంప్స్ ఎంతో చేయూతనిస్తున్నాయి. తమ మనసులోని బాధలు, భావాలు పంచుకునే స్నేహితులను అందించే వేదికలుగా మారుతున్నాయి.
ఆమె అనుభవం నుండి
కేరళకు చెందిన రఫియా కూడా ఒకప్పుడు ఇలా బాధలు అనుభవించే వచ్చింది. అందుకే విడాకులు తీసుకున్న మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. తన వ్యక్తిగత జీవితంలో ఎంతో మానసిక వేధన అనుభవించింది. కానీ చాలా మంది మహిళలు తమ బాధలను బయటకు చెప్పుకోలేక లోలోపలే కుంగిపోతుంటారు. కానీ రఫియా మాత్రం తన మనసులోని బాధను ధైర్యం చేసి సోషల్ మీడియాలో పంచుకుంది. రఫియాకు సోషల్ ఇన్‌స్టాలో ‘కుక్ ఈట్ బర్న్’ అనే అకౌంట్ ఉంది. అందులో ఆమె సరదా వీడియోలు పెడుతుండేంది. అందులోనే తన విడాకుల జీవితం గురించి కూడా పంచుకుంది. తర్వాత దీనికి వచ్చిన స్పందన చూసి ఈ సమాజంలో తనలాంటి వారు ఎందరో ఉన్నారని గుర్తించింది. విడాకులు తీసుకున్న మహిళలు సమాజం నుండి ఎలాంటి ఇబ్బందులు, మాటలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుంది. చాలా మంది తమను కనీసం తల్లిదండ్రులు కూడా ఆదరించడం లేదని చెప్పుకోవడం ఆమెకు మరింత బాధ కలిగించింది. అంతే అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని, వారి బాధలను పంచుకునే ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అలా పుట్టుకొచ్చిందే డివోర్సీ క్యాంప్.
ధైర్యం నింపేందుకు
సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన మహిళలతో ఆమె ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. కొద్ది రోజుల్లోనే ఆ గ్రూపులో వంద మంది మహిళలు చేరారు. వారి బాధలు, అనుభవించిన వేధన, ఇబ్బందులు అన్నీ ఆ గ్రూపులో పంచుకునేలా ప్రోత్సహించింది. అవసరమైన వారికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ కూడా ఇప్పించింది. అలా వారిలో మానసిక ధైర్యం నింపే ప్రయత్నం ప్రారంభించింది. వీరంతా కలిసి ఒకచోటకు చేరితే ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఒక్కరోజైనా అందరూ సరదాగా గడపొచ్చనే ఉద్దేశంతో ఇటీవలె డివోర్సీ క్యాంప్ పేరుతో ఒక గెట్‌టూ గెదర్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కేరళలో కొట్టాయంలోని వెగమాన్ అనే కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 15 మంది మహిళలు పాల్గొని ఎంతో సరదాగా గడిపారు. ఎన్నో భావాలను కలబోసుకున్నారు. దేశంలోనే ఇలాంటి క్యాంప్ జరగడం ఇదే తొలిసారి కావొచ్చు.
మనసారా పంచుకున్నారు
డివోర్సీ క్యాంప్‌లో పాల్గొన్న మహిళలందరూ మొదటి సారి కలుసుకున్న వారే. కానీ అందరూ కొద్ది సేపటిలోనే స్నేహితులైపోయారు. వీరంతా విడాకులు తీసుకున్న వారు కాదు. కొందరు విడాకులు తీసుకుంటే మరికొందరు తీసుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరంతా తమ జీవితాల్లో అనుభవించిన బాధలను మనసారా పంచుకున్నారు. అంతే కాదు ఎవరికి వారు వారిలోని నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఎంతో సరదాగా గడిపారు. మాటలు, నవ్వులు, కన్నీళ్లు, ఆటలు, డ్యాన్సులతో కేరింతలు కొట్టారు. కొంతమంది అయితే తమ పిల్లలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అందమైన ప్రకృతిలో సరదాగా గడిపిన వారు మరింత అందమైన జ్ఞాపకాలను మోసుకొని కొత్త ఉత్సాహంతో ఇంటికి తిరిగి వెళ్ళారు. దాంతో రఫియా తన తొలి క్యాంప్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకే ఇలాంటి క్యాంప్‌లు మరిన్ని పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది.
మంచి జీవితం కోసం
‘సమాజంలో విడాకులను ఇప్పటికీ వ్యక్తిగత వైఫల్యంగా చూస్తున్నారు. విడాకులు పొందిన మహిళల గురించి మాట్లాడుతూ ఆమెకు చేతగాక కాపురాన్ని పాడు చేసుకుందని అనుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి మొదలుపెడితే అందరూ సానుభూతిగా చూస్తారు. అప్పటి వరకు ఉన్న స్నేహ సంబంధాలన్నీ ఒక్కసారిగా దూరమవుతాయి. అంతేకాదు విడాకుల వల్ల మహిళలకు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో నష్టముంటుంది. దాంతో ఎంతో మానసిక క్షోభకు గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మన్యూనతా భావంలో బతకకుండా మాకంటూ కొంత సమయం ఉండాలని కోరుకుంటున్నాం. జీవితాన్ని హాయిగా గడపాలని భావిస్తున్నాం. అందుకు ఈ డివోర్సీ క్యాంపులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విడాకుల తర్వాత కూడా మంచి జీవితాన్ని సాధించవచ్చు’ అంటూ రఫియా పంచుకుంది.