నవతెలంగాణ-హైదరాబాద్: గాజాపై ఇజ్రాయిల్ నేత మోషే ఫైగ్లిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ”మాకు శత్రువు హమాస్, దాని మిలటరీ వింగ్ మాత్రమే కాదు. గాజాలోని ప్రతి బిడ్డా, ప్రతి శిశువు మాకు శత్రువే. ఆ నగరాన్ని మేం ఆక్రమించుకుని, అక్కడ స్థిరపడాలి. అక్కడ ఒక్క బిడ్డకూడా మిగలడు. ఇంతకంటే గొప్ప విజయం మరొకటి లేదు” అని అన్నారు. ఇజ్రాయిల్ ఒక హాబీగా శిశువులను చంపుతోందని ఐడిఎఫ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కొత్త రాజకీయ పార్టీ ది డెమోక్రాట్స్ అధ్యక్షుడు యైర్ గోలన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం ఫైగ్లిన్ వ్యాఖ్యలు వచ్చాయి.
ఇటీవల మీడియా సమావేశంలో నెతన్యాహూ చర్యలపై గోలన్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మనం తిరిగి వివేకవంతమైన దేశంగా వ్యవహరించకపోతే, దక్షిణాఫ్రికా మాదిరిగా ఇజ్రాయిల్ ఒక నిరంకుశ రాజ్యాంగా మారే అవకాశం ఉందని అన్నారు. వివేకవంతమైన దేశం సాధారణ పౌరులపై పోరాడదు. శిశువులను హాబీగా చంపదు. దేశం నుండి ప్రజలను ప్రజలను వెళ్లగొట్టదు. సంక్షోభ సమయంలో ప్రస్తుత నాయకత్వం దేశాన్ని నైతికత, సమర్థవంతంగా నడిపించకుండా, ప్రతీకారధోరణితో నిండిపోయింది. ఇది మన ఉనికికే ప్రమాదం కలిగిస్తుందని అన్నారు. ఇజ్రాయిల్ గాజాపై తమ దాడిని ముమ్మరం చేసింది. గాజా భూభాగం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని నెతన్యాహూ సోమవారం ప్రకటించారు.