నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఆకస్మిక గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికీ అవగహన అవసరమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సిపిఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీపీఆర్ పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రజా జీవితంలో అకస్మాత్తుగా కొందరికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాంటి వారికి సీపీఆర్‌తో ప్రథమ చికిత్స అందజేస్తే ప్రాణా పాయ స్థితి నుంచి బయట పడతారన్నారు. ఓ వ్యక్తికి ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు, వైద్య సహాయం అందేలోపు ఛాతీని 30 సార్లు నొక్కి, 2 శ్వాసలు ఇవ్వడం (30:2 రేషియో) ద్వారా గుండెను సాధారణ స్థితికి తీసుకు రావచ్చని తెలిపారు. కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలో సిపిఆర్ పై ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ విధానంపై గ్రామాల నుంచి పట్టణాల దాకా అందరిలోనూ అవగాహన పెంచేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సిపిఆర్ ఎలా చేయాలన్న దానిపై మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ వెంకటేష్, వేణుగోపాల్ ప్రయోగపూర్వకంగా తెలియజేశారు. అవగాహన కార్యక్రమంలో ఎంపిడిఓలు, హౌసింగ్ ఎఈలు, పంచాయతి సెక్రెటరీలతో సిపిఆర్ ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జిల్లా వైద్య అధికారిణి డాక్టర్ రాజశ్రీ, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, డిప్యూటీ సీఈఓ సాయన్న, హౌసింగ్ ఏ.ఈలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సీపీఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES