నవతెలంగాణ-హైదరాబాద్: అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయు వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్ష శుక్లా ఎల్లుండి నింగి నుంచి భూమ్మీదకి దిగనున్నారు. అందుకు అమెరికా స్పేస్ సెంటర్ నాసా వారి రాక సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు ఈనెల 15న భూమికి తిరిగి రానున్నారు.
భారత కాలమానం ప్రకారం వీరు ఈ నెల 14న మధ్యాహ్నం 2.25 గంటలకు.. అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న డ్రాగన్ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. స్పేస్‌సూట్‌లు ధరించి, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. సాయంత్రం 4.35 నిమిషాలకు ఈ వ్యోమనౌక.. అంతరిక్ష కేంద్రంతో విడిపోతుంది. క్రమంగా వేగాన్ని తగ్గించుకొని భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది.
మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుంది. అనంతరం వ్యోమగాములు ఏడు రోజుల పాటు ప్రత్యేక పునరావాస కేంద్రంలో ఉంటారు. దాదాపు 18 రోజుల పాటు రోదసిలోని భారరహిత స్థితిలో గడిపిన వ్యోమగాములు తిరిగి భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటుపడేలా చూడటం దీని ఉద్దేశం. మరోవైపు శుభాంశు ఆరోగ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు సంబంధించిన ఫ్లైట్ సర్జన్లు కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.