Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకల్లు గీత వృత్తిదారులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

కల్లు గీత వృత్తిదారులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

- Advertisement -

– కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ
– జులై 14న జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

కల్లు గీత వృత్తిలో ప్రమాదానికి గురైన వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జులై 14న జిల్లా కలెక్టరేట్‌ల ముందు నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎక్స్‌గ్రేషియా గురించి అనేకసార్లు అధికారులకు, మంత్రులకు విన్నవించినా ఎలాంటి స్పందనా లేదన్నారు. 2024 జులై 14న లస్కర్‌గూడలో జరిగిన కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభ సభలో ఎక్స్‌గ్రేషియా విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. అప్పుడే ఆ రోజే డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారని తెలిపారు. కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. సీఎం మాట చెప్పి ఏడాది అయినందున అదే రోజు జులై 14న ప్రమాద బాధితులతో అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేయాలని తమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రమాదాలకు గురైన వారికి టాడి కార్పొరేషన్‌ నుంచి తక్షణ సహాయం, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25,000, గాయడిపన వారికి రూ.15,000 చొప్పున 2021 అక్టోబర్‌ నుంచి ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ స్కీంను ఆపేశారని తెలిపారు. 400 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.
దీక్షలో బాధితులంతా పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నరసయ్య, హైదరాబాద్‌ నగర నాయకులు ఎస్‌.రాఘవేంద్ర, పొన్నం రాజయ్య, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి కప్పల లింగంగౌడ్‌, దొంతి ఆంజనేయులు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -