Sunday, March 15, 2026
E-PAPER
Homeసోపతిపరీక్షలు - ఏకాగ్రత

పరీక్షలు – ఏకాగ్రత

- Advertisement -

ఇటీవలే ఓ కళాశాలకు ‘కెరీర్‌ గైడెన్స్‌’ మీద విస్తృతోప న్యాసం ఇవ్వడానికి వెళితే అందులో డిగ్రీ, పీ.జి పిల్లలు పరీక్షల సమయంలో వుండే మానసిక ఒత్తిడులను ఎలా అధిగమించాలో చెప్పమని అడిగారు. వారితో మాట్లాడుతుండగా మధ్యలో ఓ విద్యార్థి లేచి సార్‌ నేను ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ని, నావి పది సబ్జక్టులు బ్యాక్‌లాగ్స్‌ వున్నాయి, భయంగా వుంది. ఎలా అధిగమించాలో సూచించమన్నప్పుడు ఆ పిల్లవాడికి నేను చెప్పిన కథ మీరు చదవండి. మీలో చాలా మంది ఇలాంటి సమస్యలతోనే సతమతమవుతూ ఉంటారు. పరీక్షల పట్ల, భవిష్యత్తు పట్ల ఎలాంటి ‘ప్లానింగ్‌’ లేకుండానే తరగతులు దాటేస్తూ వుంటారు. తీరా చివరి సంవత్సరంలో గాడి (ట్రాక్‌) తప్పిన రైలు బోగిలా ఎటు వెళ్ళాలో తెలియక జంక్షన్‌లో నిలబడిపోతారు.

ఒక యువకుడు గురువు వద్దకు వచ్చి నేను ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను, కానీ నాకు పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు భయంగా ఉంటుంది. దయచేసి ఈ సమస్య నుండి గటెక్కించండి అంటాడు. దానికి గరువు శిష్యుడిని చూసి చిన్నగా నవ్వి శిష్యా ఒక గిన్నె (పాత్ర)లో నిండా నీరు పట్టుకొనిరా అంటాడు. గురువు ఆదేశం మేరకు శిష్యుడు గిన్నె నిండా నీరు పట్టుకొని వచ్చి గరువు ఎదురుగా నిలబడతాడు. అప్పుడు గురువు గిన్నెలో వున్న నీటిలో నీ ముఖం చూసుకో అంటాడు. గురువు ఆదేశం ప్రకారం చేతిలో వున్న గిన్నెలో ముఖం చూసుకోనే ప్రయత్నం చేస్తాడు. కానీ స్పష్టంగా కనిపించదు. దాంతో శిష్యుడు గురువుతో ఇలా అంటాడు… గురువర్యా ఈ కదులుతున్న నీటిలో నా ముఖం కనిపించడం లేదు ఏమి చేయమంటారు? అని.
గురువు శిష్యుడిని ఉద్దేశించి ‘శిష్యా నీ ఆలోచనలు, నీ మనస్సు కూడా ప్రస్తుతం గిన్నెలోని నీరు మాదిరిగానే కదులుతున్నాయి, గిన్నెను నువ్వు కదలకుండా పట్టుకుంటే నీరు నిశ్చలంగా వుంటుంది. గిన్నెలో నీరు నిశ్చలంగా లేదు అంటే దానికి కారణం నువ్వే కదా? అంటూ ఈ కదులుతున్న నీరే ‘మనస్సు’, నీ ఆలోచనలకు ప్రతిబింబం. దాని మీద నువ్వు ‘ఏకగ్రత, పట్టు’ సంపాదిస్తే నీకు ఎదురయ్యే ఏ సమస్యైనా స్వల్పంగానే కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మనస్సును లగం చేయి. ఏకగ్రతగా వుండే విధంగా ఆలోచనలను ‘స్థిరంగా’ వుంచుకో అప్పుడు నువ్వు విజయానికి దగ్గరగా వున్నట్లు భావించాలి అంటాడు.
ఈ చిన్న కథ ద్వారా అర్థమైనదేమిటో ఓసారి ఆలోచించండి. తరగతి గదిలో గురువుల ద్వారా విన్న పాఠాలు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, అవి మీ మనోఫలకంపై బలంగా ముద్రించబడతాయి. కానీ మీరు సహజంగా అలా చేయ్యరు. పాఠశాల స్థాయిలో వున్న పిల్లలైతే ఎప్పటి అభ్యసనా కార్యక్రమాలను అప్పుడే పూర్తి చేసుకొని మీ గురువులతో సరి చేయించుకుంటారు. ప్రతి పరీక్షకు ఎప్పటికప్పుడు చదివే అవకాశం వుంటుంది. కాని సమస్యల్లా పాఠశాల స్థాయి దాటగానే, కళాశాలకి వెళ్ళగానే ఆ క్రమశిక్షణ, అంకితభావం, చదువులపట్ల ధ్యాస కొంత సన్నగిల్లుతుంది. కారణం ఆ వయసులో వచ్చే మార్పులు (టీనేజ్‌). ఫలితంగా ప్రపంచం మారుతున్నట్లుగా మీకు అనిపిస్తున్నా, నిజానికి మారుతున్నది ప్రపంచం కాదు, మీ ఆలోచనలే. పర్యవసానం రోజులు గడుస్తూ వుంటాయి, పుస్తకం చేజారి పోతుంది. సెమిస్టర్‌, వార్షిక పరీక్షల షెడ్యూల్‌ వస్తుంది. ఇక మీలో ‘భయం’ మొదలౌతుంది. సమయం తక్కువగా వుంటుంది. చదవాల్సిన సిలబస్‌ ఎక్కువగా వుంటుంది. దాంతో బ్యాక్‌లాగ్స్‌ తయారవుతాయి. అప్పటి నుండి పరీక్షలను దండయాత్రలుగా భావిస్తాం. చివరి సంవత్సరం వచ్చేనాటికి 10-15 సబ్జక్టులు పెండింగ్లో పెడ్తే ఇక ‘భయం’ ఆవహించకుండా వుంటూదా? ఒక వైపు తల్లిదండ్రుల ఒత్తిడి, మరొవైపు క్లాసు రూంలో తోటి విద్యార్థుల ముందు చిన్న చూపు వెరసి మీపై ఒత్తిడి పెరిగిపోతుంది.

ఈ సమస్యకు కారకులు ఎవరు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు కాదా? మీకు ఆకలి వేస్తే మీరే కదా తినేది. మరి మీ పరీక్షలు మీరే కదా రాయాల్సింది. ఎందుకంత ఆశ్రద్ధ విద్య, వినోదం రెండూ తరగతి గదితో ముడిపడి వున్నవే. చదువు ద్వారా వచ్చే గుర్తింపు, గౌరవం, హోదా అధిక ఆనందం ఇస్తుంది. ఒక వ్యాపారస్తుడు కోట్లు సంపాదించాడు. కానీ చదువుకోలేదు. సమాజంలో కోటీశ్వరుడిగా మాత్రమే చలామణి అవుతాడు. ఒక పేద పిల్లవాడు చదువుకొని ఓ సుందర్‌ పిచారు, మరో సత్యనాదెళ్ళ, జూకర్‌ బర్గ్‌, స్టీవ్‌ జాబ్స్‌ లాంటి స్థాయికి చేరుకొని ప్రపంచస్థాయి గుర్తింపును పొందాడు. వ్యాపారస్థుడి గుర్తింపు కన్న, ఈ రకమైన గుర్తింపును ప్రపంచం ప్రశంసిస్తుంది.
అందుకే ఆలోచించండి… అసలు మీరు తరగతి గది దాక ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశ్యంతో వచ్చారు? మీ భవిష్యత్తుపట్ల, మీ జీవితం పట్ల స్పష్టమైన అవగాహన వుందా అన్న విషయాన్ని మిమ్మల్ని మీరు ముందుగా ప్రశ్నించుకోండి? తర్వాత స్పష్టమైన ప్రణాళికతో ముందుకు కదలండి. అప్పుడు మళ్ళీ ఒకసారి మీ గురువులను కలవండి. బ్యాక్‌లాగ్స్‌ నుండి ఎలా బయట పడాలి, ఆ తర్వాత ఏంటి? అనే ‘కేరీర్‌ గైడెన్స్‌’తో కూడిన సలహాలు, సూచనలు పొందండి వారి పర్యవేక్షణలో, మార్గదర్శకత్వంలో మళ్ళీ పుస్తకం పట్టి గట్టిగా కుస్తీపట్టండి. ఫలితాలు వున్న నోటీసు బోర్డులో మీ పేరు వుందో లేదో చూసుకోండి (తప్పకుండా వుంటుంది). అప్పుడు మీలో కలిగే ఆనందోద్వేగాలు ఎలాంటివో మీరే పరిశీలించుకోండి. అప్పుడే ”ప్రపంచాన్ని జయించాను” అన్న అనుభూతి కల్గుతుంది మీకు.
ఇవన్నీ ఒక ఎతైతే మీకు చదవటమే ఇష్టం లేకపోతే తక్షణమే మీ పేరెంట్స్‌కి చెప్పి మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఏ అంశం మీద మీకు శ్రద్ధవుందో స్పష్టంగా చెప్పివారి సహకారం తీసుకోండి. అంతేకాని మీ తల్లిదండ్రులకు మిమ్మల్ని ఇంజనీర్‌గానో, సివిల్‌ సర్వెంట్‌గానో చూడాలని వుంది, కానీ మీ అకాడమిక్‌ లెవల్స్‌ మాత్రం చాలా పూర్‌గా వున్నాయి ఎలా మరి? ఒక విషయం ఏమిటంటే మీ అకాడమిక్‌ లెవల్స్‌ ఎలా వున్నా అధిగమించడానికి సర్వరోగనివారిణిగా పని చేసేది మీ ‘ఆత్మవిశ్వాసమే’. అది మిమ్మల్ని బలంగా ముందుకు నడిపిస్తే ప్రపంచంలో మీరనుకున్న లక్ష్యం నుండి ఎవ్వరు మిమ్మల్ని దూరం చేయలేరు. దానికి కావల్సిందల్లా సమయాన్ని సద్వినియోగం (ుఱఎవ వీaఅaస్త్రవఎవఅ్‌) చేసుకోవడమే. ఈ కాలపు యువతకు అసలు సమస్య ఇదే (కొద్దిమందికి అందరికికాదు).
సమయాన్ని ఎలా సద్వియోగం చేసుకోవాలో తెలియక విలువైన కాలన్ని వృథాగా గడిపేస్తూ వుంటారు. ఇదే మీరు చేసే అతిపెద్ద పొరపాటు. అంతెందుకు మీరు ప్రస్తుతం ఏ తరగతిలో వున్నా మీతో పాటు చాలా మంది వుంటారు. అందులో బాగా చదివేవారు, ప్రతిభావంతులు, యావరేజ్‌గా చదివేవారు, ఇక కళాశాలకు ఏదో కాలక్షేపం కోసం వచ్చేవారు. ఇలా రకరకాలుగా విభజించుకుంటే చివరివర్గం వారితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారు ఎవరికి స్ఫూర్తిగా వుండరు. ప్రయోజకులుగా ఎదగలేరు (నామ్‌కేవాస్తే), ‘ఆయారాం గయారాం’ అన్నట్లుగా వుంటుంది. ఇక ఇందులో మీకు ఆదర్శం ఎవరంటే బాగా చదివేవారు, ప్రతిభావంతులు. మీరు ఈ కేటగిరిలో యావరేజ్‌గా మీ అకాడమిక్‌ స్థాయిలు వుంటే వారితో జట్టుకట్టండి. ఆ సమూహంలో చేరడానికి ప్రయత్నించండి. వారిని అనుసరించండి ఖచ్చితంగా మీ అకాడమిక్‌ లెవల్స్‌ మెరుగుపడతాయి. దీనికి ఋజువులు సెమిస్టర్‌కి ముందు సెమిస్టర్‌కి తర్వాత ఫలితాలు చూసుకోండి మీకే అర్థమవుతుంది.

అంతిమంగా చెప్పేదేమిటంటే పరీక్షలు ఏవైనా కావొచ్చు, అది ఇంటర్యూ ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌, సెమిస్టర్‌, వైవా లేదా వార్షిక పరీక్షలు. వీటికి మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారనే దానిపైనే మీ ‘పరీక్షల ఫలితాలు’ ఆధారపడి వుంటాయి. గాలిలో దీపంపెట్టి దేవుడా రక్షించు అంటే ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా కాపాడలేడు. పరీక్షల షెడ్యూల్‌ వచ్చినాక మీరు ఏ సినిమా థియేటర్‌లోనో, ఏ బేకరిలోనో, ఏ పార్కులోనో ఎంజారు చేస్తూ కూర్చొని, తీరా పరీక్ష గదిలోకెళ్ళి ఫలితాలు వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు కలిగేది అవమానమే. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ‘ప్రపంచంలో అత్యంత విలువైనది ‘కాలం’. దానిని ఎవరు సొంతం చేసుకోలేరు, కొనలేరు, అమ్మలేరు. అది ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మీ మైండ్‌సెట్‌ మీద ఆధారపడి వుంటుంది. కాదంటారా ఆలోచించండి. లేవండి పరీక్షలు దగ్గర పడ్తున్నాయి. పుస్తకాలు తెరవండి, మీ మనోనేత్రంతో చదవండి ఫలితం తప్పకుండా మీకు అనుకూలంగా వుంటుంది”.
(‘మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి’- వ్యక్తిత్వ వికాసం కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకంలో నుండి)

– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -