నవతెలంగాణ-హైదరాబాద్ : అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న హృదయవిధార ఘటన కరీంనగర్ జిల్లా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అడవిశ్రీరంపూర్ గ్రామానికి చెందిన పాండవుల స్వామి, భాగ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలి (21)ని భూపాలపల్లి జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేశ్‌తో ఈ ఏడాది మార్చి 10 న వివాహం జరిపించారు.. కట్నం కింద రూ.లక్ష, ఎకరం పొలం ఇచ్చారు. ప్రస్తుతం అంజలి ఆరునెలల గర్భిణీ.
వివాహం జరిగినప్పటినుంచే అదనపు కట్నం కోసం అంజలికి అత్తింట్లో వేధింపులు, భర్తతో గొడవలు మొదలయ్యాయి. వేధింపులు తట్టుకోలేక దసరా పండగకి తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. గురువారం వెంకటేశ్ అంజలిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులతో వచ్చి మాట్లాడాడు. మళ్లీ అత్తింటికి వెళ్లడం ఇష్టంలేని అంజలి అదేరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ రాజు, ముత్తారం ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



