Wednesday, April 30, 2025
Homeజాతీయంమితిమీరుతున్న సైనిక వ్యయం

మితిమీరుతున్న సైనిక వ్యయం

– పాక్‌ కంటే తొమ్మిది రెట్లు అధికం
– ప్రపంచంలోనే ఐదో స్థానంలో భారత్‌
– కాని పెహల్గాం దాడి మాటేమిటి?

పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ సంబంధాలు మంటలు రేపుతున్న వేళ, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల భద్రతా వ్యయాలు చర్చనీయాంశమవుతున్నాయి. స్టాక్‌ హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం.. రోజురోజుకూ సైనిక వ్యయాలు అత్యధిక స్థాయికి చేరుకుంటున్నాయి. శాంతి పిలుపులు వినిపిస్తున్నప్పటికీ, ఆయుధాలు కొనుగోలు చేసి శబ్దాలు మరింతగా గట్టిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కథనం
న్యూఢిల్లీ : సైనిక వ్యయంలో ప్రపంచంలోనే భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో పోల్చుకుంటే భారత్‌లో సైనిక వ్యయం తొమ్మిది రెట్లు అధికం. అయితే మన సైనిక వ్యయంతో పోలిస్తే చైనా వ్యయం నాలుగు రెట్లు అధికంగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలు సైనిక వ్యయంపై పెడుతున్న ఖర్చు ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అలజడుల కారణంగా ప్రపంచ దేశాల సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2,718 బిలియన్‌ డాలర్లకు చేరింది. సైనిక వ్యయంలో అమెరికా, చైనా, రష్యా, జర్మనీ తర్వాతి స్థానం భారత్‌దే.
ఏ దేశం ఖర్చు ఎంత?
గత సంవత్సరం అంతర్జాతీయ సైనిక వ్యయం 9.4 శాతం పెరిగింది. ప్రపంచ దేశాలు చేస్తున్న వ్యయంలో తొలి ఐదు స్థానాలలో నిలిచిన దేశాల ఖర్చే 60 శాతం వరకూ ఉంది. ఈ ఐదు దేశాలు కలిపి 1,635 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాయని స్టాకహేోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపీఆర్‌ఐ) విడుదల చేసిన డేటా తెలిపింది. భారత్‌ కంటే అమెరికా 19 రెట్లు అదనంగా సైనిక వ్యయం చేసింది. భారత్‌ తర్వాత సైన్యంపై ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాలలో బ్రిటన్‌, సౌదీ అరేబియా, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ ఉన్నాయి. భారత్‌ 86 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయగా 29వ స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌ 10 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేసింది. సైన్యంపై అమెరికా 997 బిలియన్‌ డాలర్లు, చైనా 314, రష్యా 149, జర్మనీ 88, భారత్‌ 86, బ్రిటన్‌ 82, సౌదీ అరేబియా 80, ఉక్రెయిన్‌ 65, ఫ్రాన్స్‌ 62, జపాన్‌ 55 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.
ఖర్చు ఎక్కువే కానీ…
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ వెంబడి ఉన్న నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) పొడవునా ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో ఈ నివేదిక వెలువడడం గమనార్హం. ‘అణ్వాయుధాలను కలిగిన రెండు పొరుగు దేశాలతో దీర్ఘకాలిక అపరిష్కృత సరిహద్దు వివాదాలను కలిగిన ఏకైక దేశం భారత్‌ మాత్రమే. కాబట్టి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని సీనియర్‌ సైనికాధికారి ఒకరు తెలిపారు.
సైన్యంపై మన దేశం ఎక్కువగానే ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు కేంద్ర రక్షణ బడ్జెట్‌ (రూ.6.8 లక్షల కోట్లు)లో 22 శాతం మాత్రమే నూతన ఆయుధాల కొనుగోలుకు ఉద్దేశించారు.
మిగిలిన దానిని 14 లక్షల మంది సైనికుల జీతాలకు, రోజువారీ నిర్వహణ ఖర్చులకు, 34 లక్షల మంది మాజీ సైనికో ద్యోగులు, ఇతర ఉద్యోగులపెన్షన్ల చెల్లింపునకు వెచ్చిస్తున్నారు.
ఆయుధ దిగుమతులలో రెండో స్థానం
ఆయుధాల తయారీలో భారత్‌ చాలా వెనుకబడి ఉంది. ప్రపంచంలో ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌ది రెండో స్థానం. దేశ భౌగోళిక రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఓ పద్ధతి ప్రకారం సైనిక సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన నిర్దిష్ట దీర్ఘకాలిక ప్రణాళికలు మన వద్ద లేవు. మన సాయుధ దళాల వద్ద చాలినన్ని ఫైటర్‌ జెట్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు కూడా లేవు. యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణులు, రాత్రి సమయంలో పోరాడేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి కూడా కొరతగానే ఉంది.
ఆధునీకరణలో చైనా ముందంజ
మరోవైపు చైనా తన సైనిక దళాలను నిత్యం ఆధునీకరిస్తూనే ఉంది. చైనా సైనిక బలం ఇరవై లక్షలు. అధికారిక సైనిక బడ్జెట్‌ను చైనా వరుసగా 30వ సంవత్సరం కూడా పెంచింది. వాస్తవంగా ఖర్చు చేస్తున్న మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత సంవత్సరం చైనా తన సైన్యంపై 314 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. 2023తో పోలిస్తే ఇది ఏడు శాతం అదనం. అంతేకాక గత సంవత్సరం ఆ దేశం అనేక ఆధునిక నూతన సైనిక సామర్ధ్యాలను ఆవిష్కరించింది. తన అణ్వాయుధ అమ్ముల పొదిని వేగంగా విస్తరించుకుంటోంది. గత సంవత్సరంలో ఏరోస్పేస్‌, సైబర్‌స్పేస్‌ దళాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుందని ఎస్‌ఐపీఆర్‌ఐ విడుదల చేసిన డేటా వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img