Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు 

ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు 

- Advertisement -

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

ఖరీఫ్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు. 

ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ బి.యం. సంతోష్ మాట్లాడుతూ, జిల్లాలో ఈసారి ఖరీఫ్ లో 38,748  ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయడం జరిగిందని, 2.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలో అవసరం మేరకు ఐకెపి – 66, పిఎసిఎస్ – 13, మెప్మా – 05 మొత్తం 84 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నవంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలలో ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా  అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సేకరించిన ధాన్యాన్ని రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.  కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్ని బ్యాగులు,  టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు, తూకం యంత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేశారు.

     ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం ఇక్కడికి తరలించి విక్రయించేందుకు పలువురు ప్రయత్నించే అవకాశాలు ఉన్నందున, పొరుగు ధాన్యం రాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసు శాఖ జిల్లా యంత్రాంగంతో సమన్వయము ఏర్పర్చుకుని సమర్ధవంతంగా పని చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకు నష్టం వాటిల్లకుండా, ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల వ్యవధిలో వారి ఖాతాలలో బిల్లులకు సంబంధించిన డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, గ్రెయిన్ క్యాలిపర్స్ సరిపడా సంఖ్యలో సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకుని వెంటదివెంట ధాన్యం తూకం జరిగేలా, ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు రవాణా జరిగేలా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్లకు సూచించారు.

సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీఎస్ఓ స్వామి కుమార్, సివిల్ సప్లైస్ డీఎం విమల, జిల్లా వ్యవసాయ అధికారి జగ్గు నాయక్, డీసీఓ శ్రీనివాస్, డిఎంఓ పుష్పమ్మ, జిల్లా రవాణా అధికారి వెంకటేశ్వర్ రావు, ఏపీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -