నవతెలంగాణ-హైదరాబాద్: ఆరు దశాబ్దాలకు పైగా సేవలందించిన మిగ్ -21 యుద్ధ విమానాలు సేవల నుండి వైదొలగనున్నాయి. 1963లో మొదటిసారిగా మిగ్ -21 విమానాలను వైమానిక దళంలోకి తీసుకుంది. చివరి మిగ్-21 బైసన్ జెట్స్‌ను దశలవారీగా తొలగించనున్నట్లు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) సీనియర్ అధికారి మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చండీగఢ్ వైమానిక స్థావరంలో నిర్వహించే వీడ్కోలు కార్యక్రమంలో ఈ జెట్‌లకు విరమణ కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. మిగ్-21 జెట్‌లను ప్రస్తుతం 23 స్క్వాడ్రాన్ నిర్వహిస్తోంది. వారిని పాంథర్స్ అని కూడా పిలుస్తారు.
రష్యాలో తయారైన మిగ్ -21లను మొదటిసారి 1963లో ప్రయోగాత్మకంగా వైమానిక సేవల్లోకి తీసుకున్నారు. 2000 మధ్య కాలంలో సుఖోరు సు-30 ఎంకెఐలను తీసుకువచ్చే ఈ జెట్‌లు ఐఎఎఫ్‌కి వెన్నెముకగా నిలిచాయి. 1965- 1971లో పాకిస్తాన్‌తో యుద్ధాలు, 1999 కార్గిల్, 2019 బాలాకోట్ వైమానిక దాడులతో పాటు ఇటీవల ఆపరేషన్ సిందూర్ వంటి అనేక ప్రధాన ఘర్షణల్లో మిగ్-21లు ప్రధాన పాత్ర పోషించాయి. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ యుద్ధవిమానాలను వినియోగించారు. మిగ్-21ల స్థానంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్ ఎంకెఐఎ యుద్ధ విమానాలను చేర్చనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయ.