Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంరైతు ఆత్మ‌హ‌త్య‌లు..అగ్ర‌స్థానంలో బీజేపీ పాలిత రాష్ట్రం

రైతు ఆత్మ‌హ‌త్య‌లు..అగ్ర‌స్థానంలో బీజేపీ పాలిత రాష్ట్రం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మోడీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులు కుదేలవుతున్నారు. పంటలు సరిగ్గా పండక, చెమటోడ్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, పెరిగిన అప్పుల్ని తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదికలే నిలుస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక వెల్లడించింది. ఈ ఐదు రాష్ట్రాల్లో బిజెపి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. 2023 సంవత్సరంలో రైతులు, వ్యవసాయ కార్మికులు మొత్తం 10,786 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొంది. ఇక మహారాష్ట్రలో 38.5 శాతం, కర్ణాటకలో 22.5 శాతం రైతులు ఆత్మహత్యలతో మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి.

కాగా, వ్యవసాయ రంగంలో 2023 సంవత్సరంలో 10,786 ఆత్మహత్యల్లో 4,690 మంది రైతులు, 6,096 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో (2023లో 1,71,418 ఆత్మహత్యలు) వ్యవసాయ రంగానికి చెందిన ఆత్మహత్యలు 6.3 శాతంగా ఉన్నాయి. ఇక 4,690 మంది రైతుల ఆత్మహత్యల్లో 4,553 మంది పురుషులు, 137 మంది మహిళా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2023లో వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు 6,096. ఇందులో 5,433 మంది పురుషులు, 663 మహిళా కార్మికులు చనిపోయారు. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 2023లో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు 8.6 శాతం. మధ్యప్రదేశ్‌ 7.2 శాతం, తమిళనాడు 5.9 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

రైతుల ఆత్మహత్యలే లేని రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిశా, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, మిజోరామ్‌, నాగాలాండ్‌, త్రిపుర, చండీగఢ్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌లు నిలిచాయి. అయితే ఈ ఎన్‌సిఆర్‌బి డేటాను ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్షులు అశోక్‌ ధావలే తీవ్రంగా విమర్శించారు. ఈ నివేదికలో పశ్చిమబెంగాల్‌ రైతుల ఆత్మహత్యలే లేని రాష్ట్రంగా ఉంది. అది తప్పు. వాస్తవానికి ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహ్యలే ఎక్కువగా ఉన్నాయి అని ఈ నివేదికను తప్పుపట్టారు. వ్యవసాయ రంగంలో 2021, 2022, 2023లో పదివేల మంది కంటే ఎక్కువమందే రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నివేదికలున్నాయి. రైతుల ఆత్మహత్యలకు కారణం మోడీ ప్రభుత్వ విధానాలేని అశోక్‌ ధావలే తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్ర రైతుల స్మశాన వాటికగా మారిపోయింది. మరట్వాడా, విదర్భ ప్రాంతాల్లో పత్తి, సోయాబీన్‌ పంటల్ని అధికంగా పండిస్తారు. ఈ పంటల్ని పండించే రైతులే ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతుంది. ట్రంప్‌ ఆంక్షల వల్ల కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీనర్థం రాబోయే రోజుల్లో అమెరికన్‌ పత్తి భారత్‌కు దిగుమతి అవుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. మన దేశ వ్యవసాయం పూర్తిగా నాశనం అవుతుంది. వ్యవసాయమే కాదు.. డైరీ, వంట నూనెలపై కూడా తీవ్రంగా ప్రభావం పడనుంది అని ఎఐకెఎస్‌ జాతీయ అధ్యక్షులు అశోక్‌ ధావలే అన్నారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -