– వ్యాపారుల సిండికేట్ మాయాజాలం
బత్తాయి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. బత్తాయి పంటకు గతేడాది కంటే ఈ ఏడాది ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో రైతులు ప్రతి యేటా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు.. బత్తాయి రేటు ఇటీవల ఎన్నడూ లేనంతగా పడిపోయింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర పెంచడానికి ససేమిరా అంటున్నారు. దీంతో ఈ సీజన్‌లో టన్ను బత్తాయిపై రైతులు రూ.15వేల నుంచి 20వేల వరకు నష్టపోతున్నారు.
నవతెలంగాణ-పెద్దవూర
నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా పండ్ల తోటలు వేస్తుంటారు. సుమారు 35 ఏండ్లుగా ఇక్కడ బత్తాయి తోటలు సాగులో ఉన్నాయి. 2007-08 సంవత్సరంలో అత్యధికంగా 3.4 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులతోపాటు కరెంటు సమస్య, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో దళారుల బెడద అధికమై లాభాలు తగ్గి నష్టాలు వచ్చాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సాగు 1.50లక్షల ఎకరాలకు పడిపోయింది. ఎక్కువ మంది వరి సాగుకు మొగ్గుచూపడంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 75 వేల ఎకరాల్లో మాత్రమే బత్తాయి తోటలు ఉన్నాయన్నది అధికార వర్గాల సమాచారం. ఈ తోటల రైతులు సైతం ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ మండలం, పెద్దవూర మండలం ఉట్లపల్లి, పులిచర్ల, పినవూర, బట్టుగూడెం, బసిరెడ్డిపల్లి, పెద్దవూర, వెల్మగూడెం, చలకుర్తి, గర్నెకుంట, సంగారం, పోతునూరు, పర్వేదుల, బోనూతల, కోమటికుంట తండా గ్రామాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా వున్నాయి.
భారీగా తగ్గిన ధరలు
బత్తాయిలో కత్తెర, సీజన్ కాయ అని రెండు దఫాలుగా దిగుబడి వస్తుంది. కత్తెర కాయ ఫిబ్రవరి నుంచి మే వరకు, సీజన్ కాయ ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దిగుబడి వస్తుంది. జిల్లా నుంచి బత్తాయిని హైదరాబాద్‌తోపాటు మెజార్టీ భాగం ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంటారు. ఢిల్లీ మార్కెట్ ఆధారంగా ఇక్కడి వ్యాపారులు రేట్ డిసైడ్ చేస్తుంటారు. ప్రస్తుతం సీజన్ కాయ వస్తున్నది. సాధారణంగా కత్తెర కాయకు మార్కెట్‌లో మంచి ధర ఉంటుంది. కత్తెరలో టన్ను బత్తాయికి రూ.25వేల నుంచి 40వేల వరకు పలుకుతుంది. కానీ ప్రస్తుతం రూ.12వేల నుంచి 18 వేలకు మించడం లేదు. దిగుబడి లేనప్పుడు మార్కెట్‌లో డిమాండ్ పెరగాల్సిన తరుణంలో రెగ్యులర్‌గా వచ్చే ధర కూడా రాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు అంటున్నారు.
ప్రభుత్వ అజమాయిషీ ఏది?
బత్తాయి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది. నల్లగొండ శివారులోని ఎస్‌ఎల్‌బీసీ స్థలంలో బత్తాయి మర్కెట్ ఏర్పాటు చేశారు. బయట మంచి ధర ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది లేదు. ధర లేని సమయంలో మార్కెట్ ద్వారా రైతులకు అండగా నిలవాలన్నదే బత్తాయి మార్కెట్ ఉద్దేశం. కానీ అలాంటి చర్యలేవీ ప్రభుత్వం వైపు నుంచి కనపడటం లేదు. అందుకే వ్యాపారుల మాయాజాలంలో బత్తాయి రైతులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుత ధరల తగ్గింపుపై ఉద్యానవన శాఖ అధికారులు సైతం తమకూ మార్కెట్ పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదని చెప్తుండటం గమనార్హం.
ఏపీలో టన్నుకు రూ.30వేల నుంచి 25 వేలు
వేలకు వేలు ఖర్చు పెట్టి బోర్లు వేయించినా వేసవిలో చుక్క నీరు అందలేదు. 2024 వేసవిలో బత్తాయి టన్ను ధర రూ.30 వేలు పలికితే, 2025 వేసవిలో రూ.18 వేలకే కొన్నారు. దళారీ వ్యవస్థను అరికట్టేందుకు నేరుగా రైతులే పంట అమ్ముకునేందుకు ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలి. పక్క రాష్ట్రంలోని అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో టన్ను రూ.30 వేలకు పోతుంటే.. మన రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు రూ.18 వేలకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి బత్తాయి రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలి.
దండ సుధాకర్‌రెడ్డి, రైతు,
పర్వేదుల (పెద్దవూర మండలం)
పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు..?
బత్తాయి పంట దిగుబడి సరిగ్గా రాలేదు. రేటు కూడా లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో ప్రతి ఏడాదీ సీజన్ క్రాప్‌లో 80 టన్నులు, కత్తెరలో 30-35 టన్నుల దిగుబడి వచ్చేది. ఈసారి టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. దానికి తోడు రేటు రూ.15-18 వేలే ఉండటంతో కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఆవుల రవీందర్‌రెడ్డి, రైతు (బట్టుగూడెం)
ధర లేకబత్తాయి రైతులు విలవిల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES