లైన్లలో చంటి పిల్లలతో
మహిళలు, వృద్ధులు
రాస్తారోకోలు, ఆందోళనలు
నవతెలంగాణ- విలేకరులు
యూరియాను పూర్తి స్థాయిలో రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కూడా ధర్నాలు జరిగాయి. రోజు మాదిరిగానే తెల్లవారుజామునే కార్యాలయాల ఎదుట బారులు తీరారు. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి) మండల కేంద్రంలో రాస్తారోకో, వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.జయశంకర్-భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా సమితి కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. మండల కేంద్రానికి ఒక లోడు యూరియా మాత్రమే వచ్చినట్టు తెలియడంతో రైతులు పెద్దఎత్తున వచ్చారు. గంటల తరబడి వర్షంలో తడుస్తూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడ్డారు. గణపురం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద 20 టన్నులతో కూడిన యూరియా లారీ వచ్చిందన్న సమాచారంతో మహిళా రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచి చెప్పులను లైన్‌లో పెట్టి నిరీక్షించారు.
సొసైటీ సిబ్బంది చిట్టీలను ఒక్కొక్కటి ఇస్తుండగా ఒక్కసారిగా రైతులందరూ ఎగబడ్డారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఎస్‌ఐ రేఖ అశోక్ రైతులకు నచ్చచెప్పి చిట్టీలు పంపిణీ చేసి ఒక్కో బస్తా చొప్పున యూరియా అందించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గవిచర్ల గ్రామంలోని ఎరువులు దుకాణం వద్ద ఉదయం 6గంటలకే రైతులు బారులు తీరారు. లారీ లోడు 400 బస్తాలు వస్తే దాదాపు700 మంది రైతులు వచ్చారు. తిమ్మాపురం గ్రామంలో ఎరువుల దుకాణం వద్ద వరుసలో నిలబడలేక చెప్పులను పెట్టి పడిగాపులు కాశారు. రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘం భవనానికి రెండు లారీల యూరియా రాగా.. తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు లైన్ కట్టారు. పది దాటినా పంపిణీ చేయకపోవడంతో రైతులు వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌ఐ ముత్యం రాజేందర్ రైతులతో మాట్లాడి శాంతింపజేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయానికి భారీగా చేరుకున్న రైతులు.. యూరియా లేదని తెలిసి మహబూబాబాద్ – ఇల్లందు జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం బాక్సులు వెంట తెచ్చుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆకుల ఎల్లయ్య తనకు యూరియా వేయకుంటే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేసి కంటతడి పెట్టుకున్నాడు.
సిద్దిపేట జిల్లాలో నంగునూర్, దౌల్తాబాద్, కొండపాక, మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డుపై బైటాయించి ధర్నాలు నిర్వహించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో జయశంకర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. శివ్వంపేట కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద యూరియా కోసం వేకువ జామునే వచ్చి .పడిగాపులు కాశారు.
సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో గల యూరియా సెంటర్ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. అలాగే, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారులతో చర్చలు నిర్వహించారు. సాయంత్రం వరకు యూరియా వస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ధర్నా చేపట్టారు. ఎస్‌ఐ కె.శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పి ఎరువుల దుకాణాదారుల నుంచి కూపన్లు అందించారు.
యూరియా కోసం రైతుల అరిగోస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES