నవతెలంగాణ తుంగతుర్తి:
రైతుల సంక్షేమం, గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న లతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.రైతుల సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని అందుకోసమే రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రైతు భరోసా నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిర ఇండ్ల నిర్మాణం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ,గృహ నిర్మాణాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, సన్న బియ్యం పథకం, రేషన్ కార్డు వంటి పథకాలను ప్రవేశపెట్టి అగ్రస్థానంలో నిలుస్తుంది అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మట్టపల్లి వెంకట్, బోర నరేష్ స్థానిక ఉపసర్పంచ్ వెలిశాల సరిత, వార్డు మెంబర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.



