నవతెలంగాణ-హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు మరణించినట్లు తెలియడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు మంత్రి కృష్ణారావు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు తోడుగా నిలబడుతుందని, అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం (విదేశాంగ శాఖ), అలాగే సౌదీ అరేబియా రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను వీలైనంత త్వరగా రాష్ట్రానికి తరలించేందుకు, అలాగే మిగతా యాత్రికుల భద్రతకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు.



