Thursday, March 26, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ఓ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో 10 మంది సజీవదహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి.

ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, 10 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -