నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బికనీర్ జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో జాతీయ రహదారి – 11 పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు రెండు కార్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖతుష్యం ఆలయ సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కార్లు ప్రమాదానికి గురయ్యాయి. రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. కార్లలో వారిని బయటకు తీసేందుకు విద్యుత్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
కాగా, మృతులను మనోజ్ జాఖర్, కరణ్, సురేంద్ర కుమార్, దినేష్, మదన్ సరన్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరు అభసింగ్‌పురా, బిగ్గా, శ్రీ దున్‌గర్‌ఘర్ వంటి ప్రాంతాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో నపసర్‌కు చెందిన సంతోష్‌కుమార్, మల్లురామ్, జితేంద్ర, లాల్‌చంద్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం పిబిఎం ఆసుపత్రికి తరలించారు.