నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి చెందింది.
సంక్రాంతి సెలవుల తర్వాత తొలి రోజు బడికి వెళ్లిన ఆ టీచర్ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. శనివారం ఉదయం విధులకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైన రావులపల్లి జీహెచ్ఎం గీత మెరుగైన చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ప్రవీణ్, సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి.
పాఠశాలలు ప్రారంభం కావడంతో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు బయలు దేరారు. వీరి కారు అర్వపల్లి దగ్గరకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పాఠశాల తెరిచిన మొదటి రోజే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


