నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక తండ్రి తన కూతురిని గొంతు కోసి చంపాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఖలాపర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కిద్వాయ్ నగర్ లో జరిగింది. గయూర్ అనే వ్యక్తి తన 19 ఏళ్ల కుమార్తె అర్జును మంచం మీద నిద్రిస్తుండగా గొంతు కోసి చంపాడు. తన నేరాన్ని అంగీకరించిన గయూర్ పోలీసులకు మొత్తం కథను చెప్పాడు. నిందితుడు తన కుమార్తె వివాహం దేవ్‌బంద్‌లో ఏర్పాటు చేశాడు. కానీ కుమార్తె వివాహానికి సిద్ధంగా లేదని చెప్పాడు. ఆమెకు వేరే వ్యక్తిని ప్రేమించినట్లు అనుమానించానని తెలిపాడు. అందుకే ఆమె వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదని భావించి చంపేసినట్లు పోలీసులకు వివరించాడు. ఈ సంఘటనకు సంబంధించి సీఓ సిటీ సిద్ధార్థ్ కె. మిశ్రా మాట్లాడుతూ.. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.