నాన్న

ఇక్కడ నిందించాల్సింది ఒక్క నాన్ననే కాదు. ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్న సమాజాన్ని కూడా. కాపాడాల్సిన నాన్న ఇలా హీనస్థితికి ఎందుకు చేరాడు..? బిడ్డల్ని భుజాలపై మోస్తూ ప్రపంచాన్ని చూపించాల్సిన నాన్న బాధ్యతల నుండి ఎందుకు తప్పుకుంటున్నాడు? బిడ్డల భవితకు భరోసా ఇవ్వాల్సిన నాన్నే బాధితుడిగా ఎందుకు నిలబడుతున్నాడు..? ధైర్యం నింపాల్సిన అతనే దీన స్థితికి ఎందుకు నెట్టివేయబడుతున్నాడు?

నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే ఓ భరోసా… నాన్నంటే ఓ హీరో. నాన్న రైతైనా, కూలైనా, పెద్ద నాయకుడైనా, ఉన్నత అధికారైనా, చిరుద్యోగైనా బిడ్డలకెప్పుడూ ఒక సూపర్‌ హీరోనే. బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ధారపోసే తండ్రి త్యాగాలే బిడ్డల జీవితాలకు పునాదులు.
నడక నేర్పించడం దగ్గర్నించీ నడత నేర్పించడం వరకు బిడ్డలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం నాన్నకు ఎంతో ముఖ్యం. అయినా నాన్న ప్రేమ బయటకు కనిపించనిది, వెలకట్టలేనిది. పిల్లల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. పిల్లలు ఉన్నతంగా ఎదిగేందుకు తన శక్తికి మించి శ్రమిస్తాడు. ఉన్నతంగా ఎదిగిన తన బిడ్డల్ని చూసి గర్వపడతాడు. వారి విజయాల్లోనే తన విజయాలు చూసుకొని మురిసిపోతాడు. అమ్మలా లాలిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న తండ్రులనూ చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నాన్న ఎప్పుడూ మంచివాడే. కానీ ఎన్ని త్యాగాలు చేసినా అమ్మ తర్వాతే నాన్న. ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసే అమ్మకు ఎవ్వరూ సాటి రారు. ఇది అందరూ అంగీకరించే సత్యం.
ఇక మనసును బాధించే విషయం ఏమిటంటే కొందరు తండ్రుల బాధ్యతారాహిత్యం. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే తండ్రులే కాదు, కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్ని వదిలించుకొని తమ సుఖాలు తాము చూసుకుంటున్న తండ్రులూ ఉన్నారు. ఆ తండ్రి వదిలేసిన బాధ్యతలను తల్లులు ఒంటరిగా భుజాలకెత్తుకుంటున్నారు. అంతేనా వ్యసనాలకు బానిసై డబ్బు కోసం పిల్లల్ని అమ్ముకునేవారూ ఉన్నారు. అంతటితో ఆగక ఉన్మాదులుగా మారుతున్న తండ్రులూ ఉన్నారు. ఇది మరింత కలచివేసే విషయం. వావి వరసులు మరిచి కన్న బిడ్డతో అసభ్యంగా ప్రవర్తిసున్నారు. మద్యం మత్తులో కన్న బిడ్డలతో కోర్కెలు తీర్చుకుంటున్నారు. బయటకు చెబితే గొంతు నులిమి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ఘోరకలి ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మన హృదయాలను కదిలించే సంఘటనలు.
ఇక్కడ నిందించాల్సింది ఒక్క నాన్ననే కాదు. ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్న సమాజాన్ని కూడా. కాపాడాల్సిన నాన్న ఇలా హీనస్థితికి ఎందుకు చేరాడు..? బిడ్డల్ని భుజాలపై మోస్తూ ప్రపంచాన్ని చూపించాల్సిన నాన్న బాధ్యతల నుండి ఎందుకు తప్పుకుంటున్నాడు? బిడ్డల భవితకు భరోసా ఇవ్వాల్సిన నాన్నే నిందితుడిగా ఎందుకు నిలబడుతున్నాడు..? ధైర్యం నింపాల్సిన అతనే దీన స్థితికి ఎందుకు నెట్టివేయబడుతున్నాడు?
వీటన్నింటికి కారణాలు ఏమిటి? రోజురోజుకు దిగజారిపోతున్న మానవ విలువలు కాదా..? ఏరులై ప్రవహిస్తున్న మద్యం కాదా..? నేటి మన కుసంస్కృతిది కాదా..? నేటి సమాజిక రుగ్మతలు మనిషిలోని మనిషితనాన్ని దూరం చేస్తున్నాయి. ఆర్థిక సమస్యలు మనలోని మానవ విలువలను మాయం చేస్తున్నాయి. అది అమ్మైనా, నాన్నైనా ఒక్కోసారి పరిస్థితులకు తలవంచక తప్పడం లేదు. ఈ రుగ్మతల నుంచి నాన్నలను కాపాడుకోవాలి. సమస్యలకు పరిష్కారాలు మూలాల నుండి వెదకాలి. అప్పుడే నాన్నను కాపాడుకోగలం. నాన్నను నాన్నగా నిలుపుకోగలం. మరో విషయం… తండ్రుల దినోత్సవం అంటే ఈ ఒక్కరోజు జరుపుకుని కానుకలు ఇచ్చి మురిసిపోయే తంతుగా మిగిలిపోకూడదు. ప్రతి రోజూ నాన్నను గౌరవించుకుంటూ… బాధ్యతలు మరిచిన తండ్రి బాధ్యతలు గుర్తు చేస్తూ కుటుంబాన్ని.. తద్వారా సమాజాన్ని కాపాడుకుందాం.

Spread the love