ఏళ్లు గడుస్తున్నా.. పట్టించుకోని పాలకులు, అధికారులు
నవతెలంగాణ – అచ్చంపేట : మండల పరిధిలోని రంగాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మలమూత్ర విసర్జనకు బాలికలు, బాలురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 84 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో త్రాగు నీరు లేదు, మూత్రశాలలు లేవు తరగతుల కొరత తీవ్రంగా ఉంది. తప్పనిసరి పరిస్థితులలో వరండాలో తరగతి గది నిర్వహిస్తున్నారు. పరిసరాలు పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.
గత ప్రభుత్వంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో గత ప్రభుత్వం రూ.60 లక్షలతో అదనపు గదుల కోసం నిధులు మంజూరు చేసింది. కానీ అధికారులను నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల పట్టించుకోకపోవడంతో పనులు అసంపూర్తిగా ఆగిపోయాయని పాఠశాల హెడ్మాస్టర్ శంకర్ తెలిపారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో గ్రామంలో ఇల్లు ఇల్లు తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వివిధ ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని హెడ్మాస్టర్ తెలిపారు. కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మౌలిక వసతులు కల్పించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తా : పాఠశాల హెడ్మాస్టర్ శంకర్