Sunday, November 16, 2025
E-PAPER
Homeఖమ్మంసామినేని హంతకుల తేల్చేవరకూ పోరాటం

సామినేని హంతకుల తేల్చేవరకూ పోరాటం

- Advertisement -
  • 19న కాంగ్రెస్‌, బీజేపేతర పక్షాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం
  • ప్రజాస్వామ్యవాదులతో కలిసి నిరసన కార్యక్రమాలు
  • పోలీసు కార్యాలయాల ముట్టడికీ కార్యాచరణ
  • డిప్యూటీ సీఎం భట్టీ ఒత్తిడి మేరకే విచారణలో జాప్యం
  • సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు, రైతుసంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్ష, కార్యదర్శి, చింతకాని మండలం పాతర్లపాడుకు మాజీ సర్పంచ్‌ సామినేని రామారావు హత్య జరిగి నేటికీ 17 రోజులు అవుతున్నా దోషులను తేల్చటంలో పోలీసుశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు తెలిపారు. 19వ తేదీన కాంగ్రెస్‌, బీజేపేతర అఖిలపక్షాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీనికి ప్రజాస్వామ్య, ప్రజాతంత్రవాదులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యను ఇలా వదిలే ప్రసక్తే లేదని, నేరస్తులను అరెస్టు చేసే వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ ఒత్తిడి, ముఖ్యంగా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఒత్తిడి మేరకే విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోతినేని మాట్లాడారు. సామినేని హత్య కేసు విచారణ పక్కదోవ పట్టేలా సాగుతోందన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి తలగ్గి ఎంక్వైరీని ఇలాగే జాప్యం చేస్తే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అఖిలపక్షాలు, ప్రజాస్వామ్యవాదులతో కలిసి పోలీస్‌స్టేషన్‌లను ముట్టడిస్తామని ప్రకటించారు.
కనిపించే నేరస్తులను వదిలి కానరాని వారికోసం అన్వేషణ
సామినేని కేసు విషయంలో పోలీసు విచారణ కనిపించే నేరస్తులను వదిలి కానరాని వారికోసం అన్వేషణలా సాగుతోందని పోతినేని అన్నారు. హత్య జరిగిన రోజే నేరస్తులు ఫలానా వాళ్లని రామారావు సతీమణి స్వరాజ్యం ఫిర్యాదు చేశారని తెలిపారు. గ్రామానికి చెందిన ఐదుగురు ఈ హత్యా నిందితుల్లో ఉన్నారని ఆమె పిటిషన్‌ ఇచ్చినా పోలీసులు దానిని పూర్తిగా పక్కన పెట్టేసి.. రామారావుకు కుటుంబ సమస్యలు ఏమున్నాయి?, ఆయనకు పార్టీలో అంతర్గత సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఏమున్నాయి?… రామారావు కుమారులు, కుమార్తె, మనవళ్లు, మనవరాళ్లు వాళ్లు చదువుకున్న కాలేజీలు, ఆ కళాశాలల్లో వారికి శత్రువులు ఎవరున్నారు? అని పోలీసులు విచారిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేరస్తులు ఫలానా వాళ్లూ అంటే వాళ్లను విచారించకపోగా, హత్య జరిగిన రోజు ఆ గ్రామ, నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఏ తప్పుడు ఆరోపణలైతే చేశారో ఆ ప్రచారాలకు అనుగుణంగా పోలీసు విచారణ సాగుతోందన్నారు. ఇలా ఎన్ని రోజులు పోలీసు విచారణ సాగించినా దోషులు తేలే పరిస్థితి లేదన్నారు. ఇదీ రాజకీయ హత్య అంటే పోలీసు కమిషనర్‌ ఏమాత్రం సహించలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. జిల్లా అత్యున్నతమైన పోలీసు అధికారే ఇలా ఉన్నారంటే ఏ మేరకు అధికార పార్టీ ఒత్తిడి పనిచేస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ హత్య వెనుక పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉందని ఎవరంటే…వారిపైనే పోలీసు కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించటం సరైన పద్ధతి కాదన్నారు. ఈ రూపంలో విచారణ కొనసాగితే సభ్యసమాజం, ప్రజాస్వామ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. తాము చేసిన నేరాన్ని తప్పించుకోవటం కోసం చేసే ప్రచారాన్ని నమ్మి విచారణ సాగిస్తే దోషులను ఎప్పటికీ పట్టుకోలేరని తాము సీపీకి సూచించినట్లు తెలిపారు. ఇప్పటికీ విచారించే పద్ధతిలో మార్పురాలేదన్నారు. తాము పాతర్లపాడు గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థిగా పెడదామని భావించే వ్యక్తిని, తమ పార్టీ పూర్తికాలం కార్యకర్తను, తమ పార్టీకి చెందిన రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేశ్‌ను విచారణకు రమ్మని మధిర సీఐ ఫోన్‌ చేయటాన్ని బట్టి విచారణ ఎంత పక్కదోవ పట్టేలా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషించారు.
నేరస్తుల అరెస్ట్‌ చేసేదాకా ఉద్యమం
ఈ సమస్యను ఇలా వదలకుండా నేరస్తులను అరెస్ట్‌ చేసే దాకా ఉద్యమించాలని నిర్ణయించుకున్నామని సుదర్శన్‌రావు అన్నారు. దీనిలో భాగంగానే 19న రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆందోళనలు, పోలీసు కార్యాలయాల ముట్టడి వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. అజాతశత్రువు, మచ్చలేని మనిషి రామారావు హత్యపై సమాజమంతా స్పందించాలన్నారు. ఈ హత్యాకాండను నిరసిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళనలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేశ్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు పాల్గన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -