Sunday, July 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకోట శ్రీనివాసరావుకు సినీ, రాజకీయ ప్రముఖుల ఘన నివాళి

కోట శ్రీనివాసరావుకు సినీ, రాజకీయ ప్రముఖుల ఘన నివాళి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులుతో పాటు రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలిజేశారు. ఇదిలా ఉంటే కోట మరణవార్తను విన్న ప్రముఖులు తమ షుటింగులను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ పయనమవుతున్నారు. ఫిల్మ్‌ నగర్‌లో ఉన్న నివాసంలో కోట భౌతికకాయం ఉండగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నటుడు కోట శ్రీనివాస రావుకు నివాళులు అర్పిస్తున్నారు.

చిరంజీవి : ‘‘లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ తో ఆయన నేనూ ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తర్వాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. కామెడీ, విలన్, సపోర్టింగ్ క్యారక్టర్ ఇలా ఏ పాత్ర అయినా తను మాత్రమే చేయగలడన్న గొప్పగా నటించారు. ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మరింత మానసికంగా కుంగదీసింది. కోట శ్రీనివాసరావులాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’అని అన్నారు.

నందమూరి బాలకృష్ణ : ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

పవన్‌కల్యాణ్‌ : ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష… యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్‌గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా.. ప్రతి పాత్రలో ఒదిగిపోయారు. నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయి’లో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కలిసి నటించాం. కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని అన్నారు.

బాబూ మోహన్‌ భావోద్వేగం : ప్రముఖ నటుడు కోట అకాల మరణ వార్త విన్న బాబూ మోహన్‌ భావోద్వేగానికి గురయ్యారు. ”కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. నిన్న రాత్రి కూడా కోటతో మాట్లాడాను. కోట మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది” అని బాబూమోహన్‌ ఏడుస్తూ చెప్పుకొచ్చాడు.

బ్రహ్మానందం : కోట మహా నటుడు. రోజుకు 18 గంటలు పని చేసే వాళ్ళం. అరే ఒరే అని పిలుచుకునే వాళ్ళం. కోట లేరంటే నమ్మలేకుండా ఉన్న. నటన ఉన్నత కాలం కోట ఉంటారు

తనికెళ్ళ భరణి : గొప్ప విలక్షణ నటుడుని కోల్పోయాము. కోట వందల వేల అనుభూతులను ఇచ్చాడు. కమిట్మెంట్‌ విషయంలో కోట కాంప్రమైజ్‌ అయ్యేవారు కాదు. నాటకాలు వేస్తున్న సమయం నుండి కోట నాకు పరిచయం. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజకీయంగాను సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకన్నారు. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. సినీ ఇండిస్టీ లో ఆయన పాత్రను ఎవరు రీప్లేస్‌ చేయలేరు. కోట లేరన్న వార్త నన్ను ఎంతగానో బాధించింది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలి.

రవితేజ : ఆయనను చూస్తూ, ఆయన ప్రతి పాత్ర నుండి ఎంతో నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబారు నాకు కుటుంబం లాంటివాడు, ఆయనతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను ఎప్పటికీ ఓ జ్ఞాపకంగా నాతోనే ఉంటాయి. ఓం శాంతి.

ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు : వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

వెంకయ్యనాయడు : ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోట భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ‘‘ఆయన విలక్షణ నటుడు, మానవతావాది. వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అని వెంకయ్యనాయుడు తెలిపారు.

తెలంగాణ సీఎం రేవంత్ సంతాపం : ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విచారకరమన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా కోట మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆయన పేర్కొన్నారు. విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వైఎస్ జగన్ నివాళులర్పించారు.

కేసీఆర్, కేటీఆర్ సంతాపం : కోట శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని కేసీఆర్ అన్నారు. ఆయన మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -