– బ్యాంకు శాఖ కార్యాలయంలోని నాలుగో అంతస్తులో ఘటన
– మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
– సెలవు రోజు కావడంతో తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌బీఐ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నీసెంటర్‌లోని ఎస్‌బీఐ భనవం నాలుగో అంతస్తులో బ్యాంకు లోన్లకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం సాయంత్రం నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అటుగా వెళుతున్నవాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతోపాటు భారీ క్రేన్ సాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనానికి చుట్టు పక్కల పలు వ్యాపార సముదాయాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ఫోమ్తో పిచికారి చేస్తున్నారు. బ్యాంక్‌లో ఎక్కువ ఫర్నీచర్ ఉందని, ఈ ప్రమాదంలో బ్యాంకుకు చెందిన ఫర్నీచర్‌తో పాటు లోన్లకు సంబంధించిన కీలకమైన ఫైళ్లు అన్నీ పూర్తిగా కాలిపోయినట్టు ఫైర్ సిబ్బంది వెల్లడించారు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఆదివారం బ్యాంక్‌కు సెలవు కావడంతో ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియక పోయినప్పటికీ బ్యాంకులో షార్క్ సర్య్కూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES