నవతెలంగాణ-హైదరాబాద్: దుబాయ్ విమానాశ్రయం సమీపంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయం పరిసర ప్రాంతంలోని ఇంధన ట్యాంక్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ దాడి కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమిక సమాచారం వెల్లడించింది. దుబాయ్ సివిల్ డిఫెన్సు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తున్న వేళ, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు మరియు మిత్రదేశాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, గత గంటన్నరలో దేశ తూర్పు ప్రాంతంలోకి ప్రవేశించిన 37 డ్రోన్‌లను అడ్డుకున్నట్లు సౌదీ డిఫెన్సు మంత్రి ప్రకటించారు. అయితే ఆ డ్రోన్‌లు ఎక్కడి నుంచి ప్రయోగించబడ్డాయన్న విషయం వెల్లడించలేదు.
అదే సమయంలో, సౌదీ అరేబియా తూర్పు తీరంలోని రాస్ తన్నురా శుద్ది కర్మాగారంపై దాడులు, యూఏఈ సరిహద్దుకు సమీపంలోని షైబా చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి ప్రయత్నాలకు ఇరాన్‌కు సంబంధం లేదని సౌదీ అరేబియాలోని ఇరాన్ రాయబారి అలిరేజా ఇనాయతి స్పష్టం చేశారు.



