నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి ఎక్స్ప్రెస్ రైలు చక్రాల కింద అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రైల్వే సిబ్బంది గమనించి వెంటనే మంటలు ఆర్పి వేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెలగావి (07043 నెంబర్ గల స్పెషల్ పేరు స్పెషల్ రైలు ) ఎక్స్ప్రెస్ రైలు గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో శంకర్పల్లి రైల్వే స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రైలు చక్రాల కింద మంటలను పాయింట్ మెన్ గుర్తించారు.
పాయింట్ మెన్ ఆనంద్ వెంటనే విషయాన్ని శంకర్ పల్లి రైల్వే స్టేషన్ మాస్టర్ సమర్జిత్ ఎస్.కె సింగ్ కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో శంకర్పల్లి గొల్లగూడ రైల్వే స్టేషన్ల మధ్య రైలును ఆపగా సిబ్బంది అగ్నిమాపక ఎక్స్ టిన్షన్ ( మంటలను ఆర్పే యంత్ర సాధనం ) తో మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా రైలు బ్రేక్ జామ్ అయితే చక్రాల కింద మంటలు వస్తాయని రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అనంతరం అధికారులు రైలును బెలగావి పంపించి వేశారు.



