Tuesday, September 30, 2025
E-PAPER
Homeజాతీయంకరూర్‌ తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్‌

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కరూర్‌లో తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్‌ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, విజయ్ ప్రచారం తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. కరూర్‌ ఘటన గురించి రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్‌ విచారణను వేగవంతం చేసింది. రెండోరోజూ ఆమె ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ పరిసర వాసులతో మాట్లాడారు.

అలాగే ఐదుగురు మరణించిన ఏలురు పుదురు, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విశ్వనాధపురి గ్రామానికి వెళ్లి అక్కడి బాధితులతో మాట్లాడారు. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ కమిషన్‌ విచారణ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ బయటకు వచ్చింది. ఈ కేసు విచారణ అధికారిగా ఇది వరకు నియమితులైన డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించారు. ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను సోమవారం రంగంలోకి దించారు.

ఘటనా స్థలంలో భద్రతా విధులలో ఉన్న మణివణ్ణన్‌ అనే ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే కరూర్‌ జిల్లా కార్యదర్శి మదిఅళగన్‌, రాష్ట్ర కార్యదర్శి భుస్సీ ఆనంద్‌, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌తో పాటూ ఇతరులు అంటూ మొత్తం నలుగురిపై ఐదు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అలాగే తనపై దాడి చేశారంటూ అంబులెన్స్‌ డ్రైవర్‌ ఈశ్వర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో 10 మంది గుర్తు తెలియని టీవీకే వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఐదు సెక్షన్లతో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో సమగ్ర వివరాలను పొందుపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -