నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిగా దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈక్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది.
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లతో పాక్ మిలిటరీ పోస్ట్‌లను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే ఏ సెక్టార్‌లోని పోస్ట్‌ను నేలకూల్చారన్నది మాత్రం తెలియరాలేదు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చినట్లు తెలుస్తోంది.