– అధిక సాంద్రత, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు రోగకారక సూక్ష్మక్రిముల వ్యాప్తి ప్రభావం
– రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లో తగ్గుతున్న నీటిమట్టం
– పరిస్థితుల ప్రభావంతో పరిమాణం రాకున్నా వేట
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అనేక చెరువుల్లో ఎండవేడిమితో చేపలు మృత్యువాత పడుతున్నాయి. అధిక సాంద్రత, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్ల రోగకారక సూక్ష్మక్రీముల వ్యాప్తి అధికమవుతుండటంతో పలు ప్రాంతాల్లో చేపలు చనిపోతున్నాయి. కొన్నిచోట్ల యాజమాన్య పద్ధతుల్లో లోపాలు కూడా తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో సహజ జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేపలు పెంచుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25వేల చెరువుల్లో చేపల పెంపకం కొనసాగుతోంది. మత్స్యకారులకు ఏటా సుమారు రూ.27వేల కోట్ల ఆదాయం చేపల ద్వారా లభిస్తోంది. ఎండలు పెరుగుతున్న కొద్దీ వనరుల్లో నీటిమట్టం తగ్గుతోంది. వర్షాకాలం వచ్చే వరకు కొత్తనీరు వచ్చే అవకాశం లేదు. నీటి వనరుల్లో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే.. చెరువులో నీరున్న ప్రాంతానికే చేపలన్నీ చేరతాయి. దీనివల్ల ఒత్తిడికి గురై చనిపోతుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గి చేపలు చనిపోతున్నాయి.
నీటి వేడితో చేపలకు అస్వస్థత..
నీటినిల్వ ఆధారంగానే చేపల పరిమాణం ఉంటుంది. తగిన మోతాదులో నీరు లేకపోవడంతో పాటు 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా మృత్యువాత పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి నిల్వ ఎక్కువగా ఉంటే చేపలు అడుగుభాగానికి వెళ్తాయి. ఆహారం కూడా ఎక్కువగా దొరుకుతుంది. నీరు తక్కువగా ఉండటంతో వెంటనే వేడెక్కుతున్నాయి. వాటిని తాగడంతో చేపలు అలసిపోతున్నాయి. అస్వస్థతకు గురై చనిపోతున్నాయి. తద్వారా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో చేపలు చనిపోతున్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. చేపలు సైజ్ కూడా రావట్లేదని, గిట్టుబాటు ధర కూడా పలకటం లేదని వాపోతున్నారు.
నీటి నిల్వపైనే చేపల పరిమాణం
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. భూగర్భజలాలు వేగంగా అడుగంటు తున్నాయి. నీటి వనరుల్లో నీరు ఇంకిపోతోంది. ఈ పరిస్థితులు చేపల పరిమాణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎదుగుదల లోపిస్తోంది. చేపల్లో సరైన ఎదుగుదల లేకున్నా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. కనీసం రెండు కేజీల సైజ్ అయినా లేకుంటే చేప అంతగా రుచి ఉండదు. వినియోగదారులు కూడా అటువంటి చేపలను కొనేందుకు ఆసక్తి చూపరు. పరిస్థితుల దృష్ట్యా చేపల ఎదుగుదల లేకున్నా మత్స్యకారులు చేపలు పట్టి మార్కెట్‌కు తరలిస్తుండటంతో చేపల సైజ్ తక్కువగా ఉండి రేటు కూడా ఆశించినంతగా ఉండటం లేదు. వాస్తవానికి మే నెల నుంచి చేపల సైజ్ పెరుగుతుంది. ఆ సమయంలో నీరు సరిపడా ఉంటే చేప పరిమాణం కూడా బాగా వస్తుంది. మే తో పాటు జూన్‌లో చేపల దిగుబడి బాగా వస్తుంది. తెలంగాణలో ఎక్కువగా మంచినీటిలోనే చేపలను పెంచుతారు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఇక్కడి చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే సైజ్ బాగున్న చేపలకే వినియోగదారులు, వ్యాపారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ చాలా వరకు చేపలు కిలో, అంతకన్నా తక్కువ సైజ్ ఉండటంతో రేటు కూడా ఆశాజనకంగా ఉండటం లేదు. తక్కువ సైజ్ ఉండటంతో వలలకు కూడా ఇవి చిక్కటం లేదని మత్స్యకారులు అంటున్నారు. ఎండ తీవ్రత బాగా పెరిగితే చేపలు బతకవనే ఉద్దేశంతో చాలా చోట్ల ఎంత సైజున్నా పడుతున్నట్టు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో 16వేల మత్స్యకార కుటుంబాలు
ఖమ్మం జిల్లాలో 219 మత్స్యకార సొసైటీలు ఉండగా సుమారు 16వేల మత్స్యకార కుటుంబాలు న్నాయి. వీరు 4 రిజర్వాయర్లలో 4,905 హెక్టార్లు, 249 శాశ్వత నీటి చెరువుల్లో 10,915 హెక్టార్లు, 568 సీజనల్ ట్యాంకుల్లో 8,343 హెక్టార్లలో చేపలు పెంచుతున్నారు. రిజర్వాయర్ల నుంచి రూ.79.74 లక్షలు, శాశ్వత నీటి చెరువుల నుంచి రూ.277.80 లక్షలు, సీజనల్ ట్యాంకుల నుంచి రూ.40.50 లక్షల ఆదాయం పొందుతున్నారు.
చేపలపై అధిక సాంద్రత, ఉష్ణోగ్రతల ప్రభావం : శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం
అధిక సాంద్రత, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వల్ల నీటిలో రోగకారక సూక్ష్మక్రీములు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి. తద్వారా చేపలు రోగాల బారినపడి చనిపోతుంటాయి. కాబట్టి మత్స్యసొసైటీలు, మత్స్యకారులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే చేపలను కాపాడుకోవచ్చు.
ఎండవేడికి చేపలు మృత్యువాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES