– తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం డిమాండ్
– ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మత్స్యకారుల మహాధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్
మత్స్యకారులకు వృత్తి రక్షణ, ఉపాధి, జీవిత భద్రత కల్పించాలని తెలంగాణ మత్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద గురువారం మత్స్యకార్మికులు మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా గోరెం కల నర్సింహ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపుల్లో మత్స్య కారులకు తీవ్ర అన్యాయం చేశా యని తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల జల వనరుల్లో మత్స్య సంపద ఉత్పత్తి నిరుపయోగంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అడవులు, కంటోన్మెంట్ ఏరియాల్లోని జల వనరులలో మత్స్యకారులు మత్స్య సంపద పెంచుకోవడానికి అవకాశాలు కల్పించి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలపై సర్వేలు, సంతకాల సేకరణ చేశామని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అవి నేరుగా మత్స్యకారులకు అందే విధంగా ఖర్చు చేయాలని, అందుకు రక్షణ చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్య సొసైటీలోని సభ్యులందరికీ ఎలాంటి షరతులూ లేకుండా రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అందించాలని కోరారు. సహజంగా మరణించిన మత్స్యకారులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి.. మట్టి ఖర్చులకు తక్షణం ఆర్థిక సహాయం రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ఎన్‌సీడీసీ, ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా మత్స్యకారులకు ఇచ్చే రుణాన్ని పునరుద్ధరించి మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన చెరువులు, కుంటల లీజులు రద్దు చేసి వాటిల్లో మత్స్యకారులకు ఉపాధి హామీ చట్టం ద్వారా పూడికతీతలు, ఫెన్సింగ్ వేయించి కంపచెట్లు కొట్టిం చాలన్నారు. మత్స్యకారులకు రూ.10 లక్షలతో ప్రత్యేక గీహ వసతి పథకం అందించాలని డిమాండ్ చేశారు.
మత్స్యకారులందరికీ రూ.5000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ స్థలాలు, అడవులు, కంటోన్మెంట్ ప్రాంతాల్లోని జలవనరులలో చేపల వేట హక్కులను నామమాత్రపు లీజుకు మత్స్యకార సొసైటీలకు ఇవ్వాలని కోరారు. 50 మంది సభ్యులున్న మత్స్య సొసైటీకి రూ.20 లక్షలతో సామాజిక కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ మాజీ చైర్మెన్ పిట్టల రవీందర్, నాయకులు కొప్పు పద్మ, శీలం శ్రీను, గొడుగు వెంకట్, చనమోని శంకర్, మునిగాల రమేష్, మురారి మోహన్ పాల్గొన్నారు.
మత్స్యకారులకు వృత్తి రక్షణ కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES