Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవరద బీభత్సం.. 24 మంది మృతి

వరద బీభత్సం.. 24 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మొత్తం 24 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని హంట్ ప్రాంతంలో ప్రవహించే గ్వాడాలుపే నది కుండపోత వర్షాలకు ఉగ్రరూపం దాల్చింది. నది ఉప్పొంగడంతో దాని తీరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ క్రిస్టియన్ క్యాంపును వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. వేసవి శిక్షణా శిబిరం కోసం అక్కడికి వచ్చిన 23 నుంచి 25 మంది బాలికలు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దీంతో తమ పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిన్నారుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు.

మరోవైపు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతైన బాలికల కోసం హెలికాప్టర్లు, పడవల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. నది ఉద్ధృతి, ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. భారీ వరదల కారణంగా అనేక నివాసాలు నీట మునిగి, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -