Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంవరద బీభత్సం.. 109కి చేరిన మృతుల సంఖ్య

వరద బీభత్సం.. 109కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఓ సమ్మర్ క్యాంప్‌లో చిన్నారులు, కౌన్సిలర్లు సహా మొత్తం 109 మంది ఈ జల ప్రళయానికి బలయ్యారు. మరో 160 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. గ్వాడలుపే నది వెంట సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గ్వాడలుపే నది తీరంలోని హంట్ ప్రాంతంలో ఉన్న ‘క్యాంప్ మిస్టిక్’లో ఈ ఘోరం జరిగింది. ఈ క్యాంప్‌కు చెందిన 27 మంది చిన్నారులు, కౌన్సిలర్లు మరణించినట్టు క్యాంప్ నిర్వాహకులు సోమవారం తెలిపారు. ఈ ఊహించని విషాదంతో తాము తీవ్ర వేదనకు గురయ్యామని, బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం స్థానిక అధికారులతో కలిసి గాలిస్తున్నట్టు చెప్పారు. కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా ప్రకారం.. క్యాంప్‌కు చెందిన మరో ఐదుగురు చిన్నారులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ ఇంకా లభించలేదని తెలుస్తోంది. వరదలు సంభవించినప్పుడు క్యాంప్‌లో సుమారు 750 మంది చిన్నారులు ఉన్నారు.

ఈ వరదల కారణంగా మొత్తం 161 మంది గల్లంతయ్యారని, వారిని గుర్తించేందుకు గ్వాడలుపే నదీ వ్యవస్థ అంతటా గాలింపు చర్యలు కొనసాగుతాయని టెక్సాస్‌ గవర్నర్ గ్రెగ్ అబాట్ మంగళవారం మీడియాకు తెలిపారు. తప్పిపోయిన తమ బంధువులు లేదా స్నేహితుల గురించి సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. గవర్నర్ అభ్యర్థన మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెర్ కౌంటీని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు.

ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెలవుల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad